LIC Dhan Vriddhi Endowment Policy : దేశంలోనే ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్ఐసీలో కోట్లాది మంది ప్రజలు పాలసీలు తీసుకున్నారు. నెలవారీ లేదా వార్షిక ప్రీమియం చెల్లించేవారు ఎంతో మంది ఖాతాదారులు ఉన్నారు. అయితే పాలసీదారులను పెంచుకునేందుకు ఎల్‌ఐసీ ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన పాలసీలను రూపొందిస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా ఎల్‌ఐసీ మరో కొత్త పాలసీని తీసుకొచ్చింది.
ధన్ వృద్ధి పాలసీ
LIC Dhan Vriddhi Plan 869 : ధన్‌వృద్ది పేరుతో ఎల్‌ఐసీ కొత్త ఎండోమెంట్ పాలసీ (ప్లాన్ నంబర్ 869)ని తీసుకొచ్చింది. ఈ పాలసీలో ఒక్కసారి మాత్రమే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. కచ్చితమైన రాబడితో పాటు డెత్ బెనిఫిట్ కూడా లభిస్తుంది. ఈ ఏడాది జూన్ 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ పాలసీ అందుబాటులో ఉంటుందని ఎల్‌ఐసీ స్పష్టం చేసింది. ఈ పాలసీలో కనీస జీవిత బీమా రూ.1,25,000 వరకు ఉండాలి.
పాలసీదారులకు రెండు ఆప్షన్లు
ఈ పాలసీలో రెండు ఆప్షన్లు ఉంటాయి. వాటిల్లో ఒక ఆప్షన్‌ను పాలసీదారులు ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా చెల్లించిన ప్రీమియానికి 1.25 రెట్లు రాబడి వచ్చే ఒక ఆప్షన్; 10 రెట్లు కవరేజీ వచ్చే రెండో ఆప్షన్ ఉంటుంది. ఈ పాలసీకి కనీస ప్రవేశ వయస్సును 90 రోజుల నుంచి 8 సంవత్సరాల మధ్య నిర్ణయించారు. ఇక గరిష్ఠ వయస్సు 32 నుంచి 60 సంవత్సరాలుగా ఉంది. ఇక పాలసీ కాల వ్యవధి విషయానికొస్తే.. 10, 15 లేదా 18 సంవత్సరాలలో దేనినైనా మీరు ఎంచుకోవచ్చు.
పాలసీ పూర్తయిన తర్వాత ఎంత వస్తుంది?
పాలసీ పూర్తయిన తర్వాత బీమా సొమ్ముతో పాటు గ్యారెంటీడ్ అడిషన్ కూడా చెల్లిస్తారు. ఒకవేళ మధ్యలోనే పాలసీదారుడు మరణిస్తే నామినీకి సొమ్ము అందిస్తారు. ఇక ప్రమాదవశాత్తూ మరణించినా లేదా వైకల్యం పొందినా బీమా సొమ్ము వస్తుంది.
గ్యారంటీడ్ అడిషన్స్ ఎలా ఉంటాయి?
తొలి ఆప్షన్‌ను ఎంచుకున్నవారికి రూ.వెయ్యికి రూ.60 నుంచి రూ.75 వరకు ప్రతి సంవత్సరం చివరిలో గ్యారంటీడ్ అడిషన్ పొందుతారు. ఇక రెండో ఆప్షన్ ఎంచుకున్నవారికి రూ.వెయ్యికి రూ.25 నుంచి రూ.40 వరకు వస్తుంది. పాలసీ పూర్తయిన తర్వాత బీమాతో పాటు ఈ అడిషన్స్ అందిస్తారు.
పాలసీదారులు ఈ పాలసీకి అదనంగా యాక్సిడెంటల్ డెత్, డిసెబులిటీ బెనిఫిట్ రైడర్లను కూడా దీనికి జోడించుకోవచ్చు. అలాగే న్యూ టెర్మ్ అస్యూరెన్స్ రైడర్ కూడా తీసుకోవచ్చు. ఈ పాలసీని, రైడర్లను ఆన్‌లైన్‌లోనూ లేదా ఎల్ఐసీ ఏజెంట్ల దగ్గర కూడా తీసుకోవచ్చు.
పాలసీదారులకు లోన్ సదుపాయం
పాలసీదారులు ఈ పాలసీ ద్వారా లోన్ కూడా పొందవచ్చు. పాలసీ తీసుకున్న మూడు నెలల తర్వాత నుంచి లోన్ తీసుకోవచ్చు. ఈ లోన్‌కు వడ్డీ రేటు కూడా తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే మెచ్యూరిటీ లేదా మరణం సమయంలో లబ్ధిదారుడు ఐదేళ్ల పాటు నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక, వార్షిక విరామాలలో క్లెయిమ్ మొత్తాన్ని ఎంచుకునే అవకాశం కూడా ఈ పాలసీలో ఉంది. ఇలా ఎన్నో బెనిఫిట్స్ ఈ పాలసీలో ఉన్నాయి.