How To Get Refund For Wrong UPI Transaction : నేటి డిజిటల్ యుగంలో రోజురోజుకు ఆన్లైన్ లావాదేవీలు, యూపీఐ పేమెంట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాస్తవానికి దీని వల్ల వినియోగదారుల పని చాలా సులువు అవుతోంది. అయితే, అప్పుడప్పుడు మనం అనుకున్న వ్యక్తికి కాకుండా, మరోవ్యక్తికి పొరపాటున యూపీఐ ద్వారా డబ్బులు పంపిస్తూ ఉంటాం. ఇలాంటి సమయంలో మన డబ్బులను ఎలా వెనక్కు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నేరుగా అవతలి వ్యక్తిని సంప్రదించండి!
UPI Dispute Redressal Mechanism : ఒక వేళ మీరు అనుకున్న వ్యక్తికి కాకుండా, మరో వ్యక్తికి యూపీఐ ద్వారా డబ్బు పంపించినట్లయితే, ముందుగా అతనికి/ ఆమెకు ఫోన్ చేయండి. మీ డబ్బులు వెనక్కు ఇవ్వమని మర్యాద పూర్వకంగా అడగండి. దీనితో సదరు వ్యక్తి మీ డబ్బును వాపసు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒక వేళ అవతలి వ్యక్తి మీ డబ్బులు వెనక్కు ఇవ్వకపోతే వెంటనే యూపీఐ యాప్ కస్టమర్ కేర్‌ను వెంటనే సంప్రదించాలి.
UPI యాప్ కస్టమర్ సపోర్ట్
ప్రతీ యూపీఐ యాప్‌నకు కస్టమర్ సపోర్ట్ సిబ్బంది ఉంటారు. కనుక మీరు డబ్బు పంపించాలనుకున్న వ్యక్తికి కాకుండా, వేరే వ్యక్తి ఖాతాకు పంపించినపుడు, యూపీఐ కస్టమర్ సపోర్ట్ వారికి వెంటనే ఫిర్యాదు చేయాలి. మీ సమస్యను స్పష్టంగా తెలియజేయాలి. అలాగే మీరు చేసిన పేమెంట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్, ట్రాన్సాక్షన్ ఐడీలాంటి సమాచారాన్ని కూడా వారికి అందివ్వాలి. దీనితో ఫిర్యాదు చేసిన 24 నుంచి 48 గంటల్లోపు మీ సమస్యను పరిష్కరించే అవకాశం ఉంటుంది.
NPCI పోర్టల్‌లో ఫిర్యాదు చేయండి
ఒక వేళ యాప్ సపోర్టింగ్ టీమ్ మీకు సరైన పరిష్కారం చూపించకపోతే NPCI అధికారిక పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి. ఇందుకోసం ముందుగా NPCI పోర్టల్‌లోని 'యూపీఐ' సెక్షన్‌ను ఓపెన్ చేయాలి. అనంతరం "Dispute Redressal Mechanism అనే విభాగంలో మీ ట్రాన్సాక్షన్‌కు సంబంధించిన వివరాలను, ఆధారాలను సమర్పించాలి. తర్వాత అన్ని వివరాలు సరిచూసుకొని, మీ ఫిర్యాదును సబ్మిట్ చేయాలి.
బ్యాంకు వారిని సంప్రదించండి
యూపీఐ యాప్ కస్టమర్ సపోర్ట్ టీమ్‌నకు, మీ రాంగ్ ట్రాన్సాక్షన్ గురించి ఫిర్యాదు చేసినా, ఎలాంటి ఫలితం లేకపోతే, వెంటనే మీ బ్యాంక్‌ను సంప్రదించాలి. ఇందుకోసం మీ బ్యాంకు కస్టమర్ సర్వీస్ టీమ్‌కు ఫోన్ చేసి, మీ ఫిర్యాదును నమోదు చేయాలి. మీరు చేసిన యూపీఐ పేమెంట్ వివరాలు, ఆధారాలు వారికి అందివ్వాలి. బ్యాంకు సదరు లావాదేవీలను పరిశీలించి, మీ సమస్యను పరిష్కరిస్తుంది. అయితే ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు దాదాపు 45 రోజులు వరకు పట్టవచ్చు. ఈ విధంగా మీరు రాంగ్ యూపీఐ ఐడీకి పంపిన డబ్బులను తిరిగి వెెనక్కు తీసుకోవచ్చు.
కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్- సిలిండర్‌పై రూ.39.50 తగ్గింపు
హెల్త్ ఇన్సూరెన్స్ మిస్టేక్స్ - ఈ తప్పులు చేస్తే ఒక్క రూపాయి కూడా రాదు!