How to Choose Real Estate Broker : ఇల్లు కొనే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. లేకపోతే అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. మనకు మంచి విశ్వసనీయమైన మధ్యవర్తి(బ్రోకర్) ఉంటే ఈ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కాకపోతే మార్కెట్‌లో ఉన్న బ్రోకర్లను అంత గుడ్డిగా నమ్మడానికి వీల్లేదు. వ్యాపారం కోసం, వారికుండే పరిమితుల రీత్యా కొన్ని అవాస్తవాలతో మనల్ని నమ్మించి.. ప్రాపర్టీని అంటగట్టే ప్రమాదం ఉంటుంది. అందుకే సమర్థమైన బ్రోకర్‌ను ఎంచుకోవాలి.
బ్రోకర్‌కు ఎంచుకునే ముందు ఈ ప్రాథమిక వివరాలు తెలుసుకోవాలి..
How To Select Good Real Estate Agent : బ్రోకర్‌కు సంబంధించిన కొన్ని ప్రాథమిక వివరాలు తెలుసుకుంటే అవి వారి విశ్వసనీయతను తెలియజేస్తాయి.
- సదరు వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వ 'స్థిరాస్తి ప్రాధికార సంస్థ (రెరా)' వద్ద నమోదై ఉండాలి.
- అలాగే అతను/ఆమె ఏదైనా అసోసియేషన్‌లో భాగస్వాములుగా ఉన్నారేమో ఆరా తీయాలి.
- జాతీయ స్థిరాస్తి వ్యాపారుల సంఘం (ఎన్‌ఏఆర్) వంటి వాటిలో రిజిస్టరై ఉంటే మంచిది. ఒకవేళ అతను ఏదైనా పొరపాటు చేస్తే అసోసియేషన్‌లో ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉంటుంది.
- బ్రోకర్‌కు ప్రొఫెషనల్ సర్టిఫికెట్ ఉందేమో కనుక్కోవాలి.
- స్థిరాస్తి వ్యాపారంలో ఉన్నవారికి మహారాష్ట్ర రెరా 20 గంటల కోర్సును అందించి పరీక్ష కూడా నిర్వహిస్తోంది. అందులో వారి ప్రతిభ ఆధారంగా సర్టిఫికెట్ అందిస్తోంది.
- ఇవన్నీ ఒక బ్రోకర్ విశ్వసనీయమైన వ్యక్తి అని చెప్పడానికి కొలమానాలేం కాదు. కానీ, సరైన స్థిరాస్తి నిపుణుడ్ని ఎంచుకోవడానికి ఇవన్నీ దోహదం చేస్తాయి.
అనుభవం..
మనం ఎంచుకున్న బ్రోకర్(మధ్యవర్తి) అనుభవాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఎక్కువ అనుభవం ఉన్నవారైతే ఇంటి కొనుగోలులో ఉపయోగకరంగా ఉంటారు. అలాంటి వారు చాలా మంది క్లయింట్లను చూసి ఉంటారు. మనకు తలెత్తే సమస్యల గురించి ముందే చెప్పగలుగుతారు. దాంతోపాటు గత అనుభవాల దృష్ట్యా అవాస్తవాలకు దూరంగా ఉండే అవకాశం ఉంది. కనీసం 10 ఏళ్ల అనుభవం ఉన్న బ్రోకర్ అయితే మేలని నిపుణులు చెబుతున్నారు.
స్థానిక మార్కెట్‌పై పట్టు..
తన అవసరాలు కొనుగోలుదారుడు చెప్పినప్పుడు బ్రోకర్ వివిధ రకాల ప్రత్యామ్నాయాలను అతడి ముందుంచగలగాలి. బ్రోకర్ వద్ద ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయో కొనుగోలుదారుడు తెలుసుకోవడం చాలా ముఖ్యం. అలాగే అతని దగ్గర అమ్మకానికి ఎన్ని ఇళ్లు ఉన్నాయో కూడా తెలుసుకోవాలి. దాంతోపాటు స్థానిక మార్కెట్‌లో ధరలు ఎలా ఉన్నాయో కూడా కనుక్కోవాలి. కారణంగా ఆ ఏరియాపై బ్రోకర్‌కు ఎంత పట్టుందో పసిగట్టవచ్చు.
ఇతర మౌలిక వసతులు బ్రోకర్ చెప్పిన విధంగానే ఉన్నాయో లేదా అనేది చూసుకోవాలి. రాబోయే రోజుల్లో ఆ ప్రాంతంలో ఎటువంటి ప్రాజెక్టులు రాబోతున్నాయి? ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పించబోతోంది? వాటికి సంబంధించిన అధికారిక ప్రణాళికల సమాచారం గురించి కూడా తెలుసుకోవడం ఉత్తమం.
సిఫార్సు చేసిన వ్యక్తే మేలు..
కేవలం వాణిజ్య ప్రకటనలు, వారిచ్చే ఆధారాలను బట్టి బ్రోకర్‌ను ఎంచుకోవడమనేది మంచి నిర్ణయం కాదు. గతంలో అతను సేవలు అందించిన కస్టమర్ల వివరాలు కనుక్కోవాలి. కనీసం ఓ నలుగురు లేదా ఐదుగురిని సంప్రదించాలి. బ్రోకర్ గురించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలి. దాంతోపాటు విశ్వనీయత ఉన్న మధ్యవర్తి కోసం మిత్రులు, బంధువుల దగ్గర కూడా ఆరా తీయాలి. ఎక్కువ మంది సిఫార్సు చేసిన బ్రోకర్‌ను ఎంచుకుంటే మేలు. ఆన్‌లైన్‌లోనూ మీరు ఎంచుకునే బ్రోకర్ గురించి వెతకండి. వారి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించండి. చాలా మంది క్లయింట్లు తమ అభిప్రాయాన్ని ఈ మధ్య ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్‌లో కామెంట్ల రూపంలో ఉంచుతున్నారు. గూగుల్ రివ్యూలు కూడా ఈ విషయంలో ఉపయోగకరంగా ఉంటాయి.
ధరలపై మంచి అవగాహన ఉండాలి..
ఎంచుకున్న బ్రోకర్‌కు ఆయా ప్రాంతాల్లో స్థిరాస్తుల విలువపై మంచి అవగాహన ఉండాలి. స్థలం, నిర్మాణ ఖర్చులు, ఇంటీరియర్స్, ఇతర వసతులకయ్యే కనీస ఖర్చులు ఎలా ఉంటాయో ఆ బ్రోకర్ చెప్పగలగాలి. తద్వారా ఓ ఇంటికి ఎంత వరకు ఖర్చు చేయాలో అంచనా వేయగలగాలి.
ఎక్కువ బ్రోకరేజీ చెల్లించొద్దు..
బ్రోకరేజీ ప్రాంతాన్ని బట్టి మారుతుంటుంది. దిల్లీలో కొనుగోలుదారులు 1 శాతం, అమ్మకందారులు 1 శాతం చెల్లిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికి జీఎస్టీ అదనంగా ఉంటుంది. అదే బెంగళూరులో అయితే బ్రోకరేజీ వరుసగా 1 శాతం, 2 శాతంగా ఉన్నట్లు సమాచారం. అలాగే కొంత మంది డాక్యుమెంటేషన్‌కు కూడా అదనంగా ఛార్జ్ చేస్తుంటారు. అందుకే బ్రోకర్ నుంచి అతనికి చెల్లించాల్సిన మొత్తం గురించి ముందే స్పష్టత తీసుకోవాలి. డాక్యుమెంటేషన్, జీఎస్టీ, ఇతర ఎక్స్ట్రా ఛార్జీల గురించి తెలుసుకోవాలి.
Bank Strike News : కస్టమర్లకు అలర్ట్.. 10 రోజులు బ్యాంక్ ఉద్యోగుల సమ్మె.. ఎప్పుడంటే..