Gold Buying Tips : దీపావళి పర్వదినానికి ముందు ధంతేరాస్(ధనత్రయోదశి) పండుగను జరుపుకొంటారు. ఈ శుభ సందర్భంగా బంగారం కొనుగోలు చేయడమనే సంప్రదాయం మన దేశంలో ఉంది. ఈ క్రమంలో పసిడిని కొనుగోలు చేస్తున్నప్పుడు బీఐఎస్ హాల్మార్క్, 24 క్యారెట్ల బంగారం, బై-బ్యాక్ పాలసీ లాంటి అంశాలు గురించి తెలుసుకోవడం ముఖ్యం. అవేంటో ఓ సారి చూద్దాం.
ఆ హాల్మార్క్ ఉన్నవాటినే కొనుగోలు చేయండి
బంగారాన్ని కొనుగోలు చేసేటప్పుడు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్(బీఐఎస్) హాల్మార్క్ ఉన్న వాటినే కొనుగోలు చేయటం మంచిది. ఈ బీ.ఐ.ఎస్ హాల్మార్క్ ఉండే వాటిపై ప్యూరిటీ కోడ్, టెస్టింగ్ సెంటర్ మార్క్, జ్యూవెల్లర్ మార్క్ ఉంటుంది. అందువల్ల ఈ గుర్తు ఉన్నవాటిని నాణ్యమైన, స్వచ్ఛమైన బంగారంగా పరిగణిస్తారు.
24 క్యారెట్ల బంగారం
సాధారణంగా బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో లెక్కిస్తారు. మన దేశంలో పసిడి 24,22,18 క్యారెట్లలో అందుబాటులో ఉంటాయి. కాగా 24 క్యారెట్ల బంగారం స్వచ్ఛమైనదని పసిడి వర్తకులు చెబుతున్నారు. అయితే అభరణాలను తయారు చేయడానికి దీని సున్నితత్వం కారణంగా అన్నిసార్లు మనం తయారు చేయలేకపోవచ్చు. సాధారణంగా అభరణాల తయారీలో 22, 18 క్యారెట్ల బంగారాన్ని ఉపయోగిస్తున్నారు. మీరు పసిడి కొనుగోలు చేసే ముందు ఎన్ని క్యారెట్లు ఉందో ఓ సారి తెలుసుకోండి.
ధరలను సరిపోల్చుకోండి
పసిడి వర్తకులు అమ్మే ధరల్లో కొంచెం తేడాలు ఉండవచ్చు. మీరు బంగారాన్ని కొనుగోలు చేసేముందు ఓ ఇద్దరు ముగ్గురు వర్తకులను అడిగి ధరలు తెలుసుకోవడం మంచిది. ఆభరణాలు తయారు చేయడానికి అయ్యే ఖర్చులను కనుక్కొండి. మార్కెట్లో పసిడి ధరలు హెచ్చుతగ్గులు అవుతుంటాయి. అందువల్ల మీరు కొనుగోలు చేసే సమయానికి బంగారం ధర ఎంత ఉందో తెలుసుకోవడం ఉత్తమం.
మజూరీ/తయారీ ఖర్చుల విషయంలో అప్రమత్తత
బంగారాన్ని కొనుగోలు చేసి ఆభరణం చేయిస్తున్నపుడు అప్రమత్తత అవసరం. ఆభరణం తయారు చేయడానికి బంగారు వర్తకులకు మజూరీ చెల్లించాలి. ఏ డిజైన్లో పసిడి ఆభరణాన్ని తయారు చేయాలనుకుంటున్నామనే విషయంపై ఆధారపడి మజూరీ ఖర్చు ఉంటుంది. ఈ విషయాన్ని గోల్డ్ షాప్ యజమానిని అడిగి తెలుసుకోవడం అతి ముఖ్యం.
- బై-బ్యాక్ పాలసీ : మీరు బంగారాన్ని కొనుగోలు చేయడానికి ముందుగానే బై-బ్యాక్ పాలసీ గురించి తెలుసుకొండి. ఒక వేళ మీరు బంగారాన్ని అమ్మితే తిరిగి దానిని ఎంత ధరకు తీసుకుంటారనేదే బై-బ్యాక్ విధానం. ఈ విషయం గురించి ముందుగానే గోల్డ్ షాప్ యజమానిని అడిగి తెలుసుకోండి.
- డిస్కౌంట్లు, ఆఫర్లు చెక్ చేయండి : పండుగల సందర్భంగా బంగారం షాప్ యజమానులు పలు ఆఫర్లను ప్రకటిస్తుంటారు. ఆయా డిస్కౌంట్లపై దృష్టి సారించండి. ఫలితంగా మీ డబ్బులు ఆదా అవుతాయి. ఆఫర్లు పత్రికల్లోను, న్యూస్ యాప్లలోను ఆయా కంపెనీలు ప్రకటనల రూపంలో ఇస్తుంటాయి.
- డాక్యుమెంటేషన్ అతి ముఖ్యం : మీరు కొనుగోలు చేసిన బంగారానికి తగిన ఇన్వాయిస్లను పొందండి. కొనుగోలు చేసిన అభరణాలపై తగిన రసీదులు పొందటం చాలా అవసరం. వాటిని డాక్యుమెంటేషన్ చేయించండి. ఇవి భవిష్యత్లో మీరు బంగారాన్ని కొనుగోలు చేయడం లేదా మార్చాల్సి వచ్చినపుడు ఆ పత్రాలు చాలా అవసరం అవుతాయి.
ధనత్రయోదశి నాడు ఈ 5 వస్తువులు తప్పక కొనుగోలు చేయాలి - ఎందుకో తెలుసా?