Twitter Employees Firin : ట్విట్టర్ నుంచి సగం మంది ఉద్యోగుల్ని తొలగించే పని ప్రారంభించారు ఎలాన్ మస్క్. ఖర్చుల్ని తగ్గించుకోవడంలో భాగంగా దాదాపు 3,700 మంది సిబ్బందిని కంపెనీ నుంచి పంపిస్తున్నట్లు సమాచారం. వీరందరికీ శుక్రవారం నుంచే మెయిల్స్ పంపుతున్నట్లు తెలిసింది. ఉద్యోగాల కోత ప్రక్రియ పూర్తయ్యేవరకు ట్విట్టర్ ఆఫీసుల్ని మూసి ఉంచాలని నిర్ణయించారు. శుక్రవారం ఎవరూ కార్యాలయాలకు రావద్దని ఉద్యోగులకు సమాచారం ఇచ్చారు.
ప్రస్తుతం ట్విటర్ అమలు చేస్తున్న ఎక్కడి నుంచైనా పనిచేసుకునే విధానాన్ని కూడా మస్క్ ఉసహరించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని మినహాయింపులను పక్కన పెట్టి మిగిలినవారంతా కంపెనీకి వచ్చి పనిచేయాలని త్వరలోనే ఆదేశాలు జారీ చేయవచ్చని సమాచారం.
గత వారం ఇదే రోజున మస్క్ 44 బిలియన్ డాలర్లుకు ట్విట్టర్‌ను కొనుగోలు చేశారు. సంస్థ పగ్గాలు చేపట్టిన వెంటనే.. సీఈఓ పరాగ్ అగర్వాల్, లీగల్ హెడ్ విజయ గద్దె, ఈఎఫ్ఓ నెడ్ సెగల్, జనరల్ కౌన్సిల్ ఎడ్జెట్‌ను మస్క్ తొలగించారు. తాజాగా ట్విట్టర్.. సంస్థ ఉద్యోగులకు ఓ ఈమెయిల్ పంపింది.
"తొలగింపులు ప్రారంభమయ్యాయి. ఉద్యోగులు ఇంటికి వెళ్లి ఇక తిరిగి రావద్దు. ట్విట్టర్‌ను సరైన పథంలో నడిపించాలంటే.. ఉద్యోగులను తొలగించక తప్పదు. సంస్థకు ఎంతో విలువైన సేవలు చేసిన చాలా మంది ఉద్యోగులపై ఈ నిర్ణయం ప్రభావం చూపుతుంది. కానీ సంస్థ ముందుకు వెళ్లాలంటే ఉద్యోగుల కోత అవసరం" అని అందులో పేర్కొనట్లు తెలుస్తోంది.
స్లాక్‌లో లిస్ట్..
తొలగించాల్సిన 3,738 మంది ఉద్యోగుల లిస్టు.. స్లాక్ మెసేజింగ్ యాప్ ద్వారా ఉద్యోగులకు చేరినట్టు సమాచారం. ఈ లిస్టులో ఇంకా మార్పులు చేసే అవకాశముందని తెలుస్తోంది. కానీ ఎంత మందిని తొలగిస్తారనే దానిపై ఇంతవరకు స్పష్టమైన సమాచారం లేదు. కానీ సగానికి పైగా ఉద్యోగులపై కోత విధించే అవకాశం ఉంది. ట్విట్టర్ పగ్గాలు చేపట్టాక ఇప్పటివరకు పలు కీలక మార్పులు చేశారు. వెరిఫైడ్ బ్లూ టిక్ రావాలంటే నెలకు రూ. 1600 చెల్లించాల్సిందేనని కొత్త విధానం తీసుకొచ్చారు. ఇదివరకు నెలకు కొన్ని రోజులు ఉద్యోగులు విశ్రాంతి తీసుకోవడానికి కేటాయించేవారు. కానీ వాటిని కూడా మస్క్ తీసేశారు.
మస్క్ ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్నప్పటి నుంచి సంస్థలో ఉద్యోగాల కోత ఉండబోతోందని జోరుగా ప్రచారం సాగింది. దాన్ని నిజం చేస్తూ తాజా పరిణామాలు జరుగుతున్నాయి. ఇందుకోసం పెర్ఫార్మెన్స్ ఆధారంగా ఎక్కువ, తక్కువ పని చేసే ఉద్యోగుల లిస్టు తయారు చేయాల్సిందిగా సంస్థ మేనేజర్లను ఆదేశించారని సమాచారం. అందుకోసం మేనేజ్మెంట్ సిబ్బంది అహర్నిశలు పనిచేస్తున్నారు తెలుస్తోంది. ఇటీవల ఓ మేనేజర్ 12 గంటలు పనిచేయాలనే ఆదేశాలతో ఆఫీస్‌లోనే నిద్రపోయారు.
ఉద్యోగుల పోరుబాట!
ఉద్యోగాల కోతపై ఉద్యోగుల నుంచి కూడా తీవ్ర నిరసన వ్యక్తమౌతోంది. మస్క్ అక్రమంగా వ్యవహరిస్తే న్యాయస్థానాలను ఆశ్రయించే యోచనలో ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకోసం 'లే ఆఫ్ గైడ్' అనే డాక్యుమెంట్‌ను ఉద్యోగులు సర్క్యులేట్ చేస్తున్నారు. అందులో కార్పొరేట్ నిఘా, ఉద్యోగుల హక్కులకు సంబంధించిన విషయాలు పొందుపరిచి ఉన్నాయి. అయితే ఈ గైడ్‌ను తయారు చేసిన ఉద్యోగిని కూడా సంస్థ నుంచి తొలగించినట్టు సమాచారం.
మస్క్ ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకున్నప్పుడు ఉద్యోగుల పరిహారం, వారి ప్రయోజనాలను ఏడాది పాటు కొనసాగించడానికి అంగీకరించారు. ఈ నిబంధనల ప్రకారం.. తొలగించిన తేదీ నుంచి.. రెండు నెలల జీతం, ఈక్విటీ నగదు విలువను ఉద్యోగులకు మూడు నెలల్లోగా మస్క్ చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై మస్క్ మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం. ఇదే కాకుండా భవిష్యత్తులో ట్విట్టర్లో మరిన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది.
ట్విట్టర్ డౌన్..
సోషల్ మీడియా యాప్ ట్విట్టర్ సేవలకు అంతరాయం ఏర్పడింది. శుక్రవారం ఉదయం లాగిన్ సమస్యలు వచ్చాయంటూ యూజర్లు ఫిర్యాదులు చేశారు. లాగిన్ చేస్తుంటే " సమ్‌థింగ్ వెంట్ రాంగ్, బట్ డోంట్ వర్రీ-ట్రై అగేన్" అంటూ పాప్అప్ మెసేజ్ వచ్చిందని పోస్టు చేశారు. ఉయదం 3 గంటలకు ఈ సమస్య ప్రారంభమైందని, 7 గంటలకు అధికమైందని తెలిసింది.
ఇవీ చదవండి : రాత్రంతా ఆఫీస్‌లోనే నిద్రపోయిన ఉద్యోగి.. 3700 మంది ఎంప్లాయిస్‌కు మస్క్ షాక్
ట్విట్టర్లో మస్క్ మార్పులు.. భారతీయుడికి కీలక బాధ్యతలు.. ఆయన సలహాలతోనే..