Different Types of Insurance Policies : ప్రతి ఒక్కరి జీవితం సాఫీగా సాగిపోతుంది కదా.. అని అనుకుంటారు. కానీ.. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ఇంటికి పెద్ద దిక్కుగా సంపాదించే వ్యక్తికి ఏదైనా జరిగితే.. ఇంటిల్లిపాదీ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో పడిపోతారు. అప్పటి వరకు ఎంతో హుందాగా జీవించిన వారి జీవితం.. ఒక్కసారిగా తలకిందులైపోతుంది. అదే ఆ వ్యక్తి జీవిత బీమా (Life Insurance)ను తీసుకుంటే, అతని కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంటుంది. అతను లేకున్నా.. పిల్లల చదువులు, పెళ్లిల్లు అన్ని జరిగిపోతాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ.. జీవిత బీమాతోపాటు మరికొన్ని బీమా పాలసీలను తీసుకోవడం మంచిది. ఎందుకంటే మీరు ఎంతో ఇష్టంగా కొనుక్కున్న వాహనానికి బీమా ఉంటే, అది మీకు ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. ఇప్పుడు జీవితంలో ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన బీమాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Types Of Insurance Policies Most Important :
1. జీవిత బీమా (Life Insurance) : ఒక వ్యక్తి బీమా తీసుకోవడానికి ముందు కొన్ని అంశాలను దృష్టిలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవి పిల్లల సంఖ్య, వయస్సు, జీవన ప్రమాణం, చేస్తున్న ఉద్యోగం. బీమా నిపుణుల ప్రకారం.. ఒక వ్యక్తి ప్రస్తుతం సంపాదిస్తున్న వార్షిక ఆదాయానికి 10 రెట్లు ఎక్కువ చెల్లించే పాలసీని తీసుకోవాలి. కానీ, అది అందరికీ సాధ్యం కాదు. అప్పుడు మీరు మీ కుటుంబానికి అయ్యే ఖర్చులను తప్పనిసరిగా లెక్కించి, మీరు చనిపోయిన తరవాత వారి జీవనోపాధికి ఎంత అవసరమని అని అనుకుంటున్నారో.. అంత పాలసీని ఎంచుకోవాలి. జీవిత బీమాలు రెండు రకాలుగా ఉన్నాయి. సాధారణ బీమా తీసుకుంటే.. నెలవారిగానో లేదా వార్షిక ప్రీమియం చెల్లిస్తూ ఉంటే అది జీవితాంతం కవర్ చేస్తుంది. ఒకవేళ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటే అవి నిర్దిష్ట కాలానికి మాత్రమే కవర్ చేస్తాయి. ఒక వ్యక్తి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేసే ముందు వయస్సు, చేస్తున్న ఉద్యోగం, పిల్లల సంఖ్య ఆధారంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
2. ఆరోగ్య బీమా (Health Insurance) : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్‌ను తీసుకోవడం చాలా ముఖ్యంగా మారింది. ఎందుకంటే కొవిడ్ లాంటి వైరస్‌ల వ్యాప్తి వల్ల చాలా మంది ఆనారోగ్యంతో మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లారు. ఆ సమయంలో చాలా మంది అప్పులు చేసి వైద్యం కోసం ఖర్చు చేశారు. అదే.. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే.. ఆసుపత్రి ఖర్చులను మొత్తం బీమా కంపెనీలు చెల్లించేవి. మీ కోసమే ఆరోగ్య బీమా తీసుకోవాలా? మీ కుటుంబ సభ్యులను కవర్ చేసేది తీసుకోవాలో ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
3. వైకల్యం బీమా (Disability Insurance) : చాలా మంది జీవిత బీమా, ఆరోగ్య బీమాలను తీసుకుంటారు కానీ, వైకల్యం బీమా తీసుకోరు. ఈ బీమా గురించి ఎక్కువ మందికి తెలియదు కూడా. పరిశ్రమలు, కూలీ పనులు చేసే వారు తప్పకుండా వైకల్యం బీమాను తీసుకోవాలి. ఎందుకంటే ఈ రంగాల్లో పని చేసేవారికి ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకేవేళ ఏదైనా ప్రమాదంలో కుటుంబ పెద్ద వైకల్యం బారిన పడితే ఈ బీమా ద్వారా కుటుంబాన్ని పోషించవచ్చు. ఈ బీమా పాలసీలో స్వల్ప, దీర్ఘకాలిక ప్రయోజనాలను సంస్థలు పాలసీదారులకు అందిస్తున్నాయి. బీమాను క్లెయిమ్ చేయడానికి వ్యక్తి వయస్సు, జీవనశైలి, ఆరోగ్య పరిస్థితులు వంటి కొన్ని అంశాలను బీమా సంస్థలు పరగణనలోకి తీసుకుంటాయి.
4. వాహన బీమా (Vehicle Insurance) : వాహన బీమాను కార్ ఇన్సూరెన్స్, మోటర్ ఇన్సూరెన్స్ అని కూడా పిలుస్తారు. దేశంలో జనాభా పెరిగిపోతుండటంతో వాహనాల సంఖ్య కూడా పెరిగిపోతుంది. దీంతో ప్రమాదాల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. వీటిలో వేలాది మంది చనిపోతున్నారు. మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం రోడ్లపై నడిచే ప్రతి వాహనానికి తప్పనిసరిగా థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ ఉండాలి. ఈ బీమా వల్ల రోడ్డుపై జరిగే ప్రమాదాల వల్ల మీరు మీ వాహనానికి ఇన్సూరెన్స్ పొందవచ్చు. మీ వాహనాన్ని ఎవరైనా దొంగిలించినా.. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయినా.. వాహన బీమాతో ప్రయోజనం పొందవచ్చు.
LIC Policy Revival Process : మీ ఎల్ఐసీ పాలసీ ల్యాప్స్ అయ్యిందా?.. సింపుల్‌గా రివైవ్ చేసుకోండిలా!