ప్రపంచంలోనే అత్యుత్తమ సమయపాలన పాటించిన 20 విమానాశ్రయాలు, విమానయాన సంస్థలతో రూపొందించిన జాబితాలో కోయంబత్తూర్, ఇండిగో చోటు సాధించాయి. 2022కు సంబంధించి విమానయాన రంగ విశ్లేషణా సంస్థ ఓఏజీ రూపొందించిన నివేదికలో, దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో కు 15వ స్థానం; ప్రభుత్వ రంగంలోని కోయంబత్తూర్ ఎయిర్‌పోర్ట్ 13వ స్థానం దక్కించుకున్నాయి. ఇండిగో ఆన్‌టైమ్ పెర్ఫార్మెన్స్ (ఓటీపీ) 83.51 శాతంగా నమోదైంది. 2019లో 77.38 శాతంతో ఈ సంస్థ 54వ స్థానంలో ఉంది.
- గరుడ ఇండోనేషియా 95.63% ఓటీపీతో అగ్ర స్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికా సంస్థ సఫైర్ (95.30 శాతం), జర్మనీ సంస్థ యూరోవింగ్స్ (95.26 శాతం) రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
- థాయ్ ఎయిరేషియా (92.33 శాతం), దక్షిణ కొరియా సంస్థ జెజు ఎయిర్‌లైన్స్ (91.84 శాతం) నాలుగు, అయిదు స్థానాలు దక్కించుకున్నాయి. జాబితాలోని థాయ్ స్మైల్ ఎయిర్‌వేస్ (16వ ర్యాంక్), డెల్టా ఎయిర్ లైన్స్ (17), వివా ఎయిర్ కొలంబియా (18), ఎతిహాద్ ఎయిర్‌వేస్ (19), ఎమిరేట్స్ (20) కంటే ఇండిగో (15) ముందు వరుసలో ఉంది.
మెగా ఎయిర్‌లైన్స్‌లో 5వ స్థానం
2022లో అత్యధికంగా షెడ్యూల్డ్ విమానాలను నడిపిన 20 సంస్థలను మెగా ఎయిర్‌లైన్స్‌గా నివేదిక గుర్తించింది. టాప్-20 మెగా ఎయిర్‌లైన్స్‌లో ఓటీపీ పరంగా ఇండిగో 5వ స్థానంలో ఉంది. ఆల్ నిప్పన్ ఎయిర్‌వేస్ (88.79 శాతం) అగ్రస్థానంలో ఉంది. జపాన్ ఎయిర్‌లైన్స్ (88.07 శాతం), లాటమ్ ఎయిర్‌లైన్స్ గ్రూప్ (85.03 శాతం), అజుల్ ఎయిర్‌లైన్స్ (84.87 శాతం) తర్వాత స్థానాల్లో నిలిచాయి.
- తక్కువ టికెట్ ధరలతో సర్వీసులు నడిపే విమానయాన సంస్థల్లో, సమయపాలన పరంగా ఇండిగోకు ఆరో స్థానం లభించింది.
- అంతర్జాతీయంగా ఓటీపీ పరంగా ఉత్తమ 20 విమానాశ్రయాల్లో కోయంబత్తూర్ ఎయిర్‌పోర్ట్ (88.01 శాతం ఓటీపీ) కు 13వ ర్యాంకు లభించింది. జపాన్‌కు చెందిన ఒసాకా అంతర్జాతీయ విమానాశ్రయం 91.45 శాతం ఓటీపీతో అగ్రస్థానం దక్కించుకుంది.
- ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని విమానాశ్రయాల్లో అత్యంత సమయపాలన ప్రదర్శించిన విమానాశ్రయాల్లో కోయంబత్తూర్ ఎయిర్‌పోర్ట్‌కు 10వ ర్యాంకు లభించింది.
విమానాయాన సంస్థకు ర్యాంకు ఇలా: షెడ్యూల్ సమయానికి 15 నిముషాల కంటే తేడా లేకుండా రాకపోకలు సాగించడాన్ని ఓటీపీగా పరిగణిస్తారు.
విమానాశ్రయాలకు: ఆయా విమానాలకు కేటాయించిన స్లాట్‌కు 15 నిముషాల కంటే తేడా లేకుండా రాకపోకలు సాగించడాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.