అమెరికా దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ మరోసారి ఉద్యోగులకు షాకిచ్చింది. ఇటీవల 10 వేలమంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన అమెజాన్.. తాజాగా 18వేలమందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా సమయంలో భారీ సంఖ్యలో ఉద్యోగులను నియమించుకున్న ఈ సంస్థ.. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా ఇప్పుడు మరి కొంతమందిని తొలగించాలని నిర్ణయించింది. కంపెనీ చరిత్రలోనే ఇంత భారీగా ఉద్యోగాల కోత విధించడం ఇదే తొలిసారి.
ఇంత భారీగా.. ఇదే తొలిసారి..
ఆర్థిక మాంద్యం భయాలతో దిగ్గజ సంస్థలన్నీ ఖర్చులు తగ్గించుకునే క్రమంలో ఉద్యోగాల కోత విధిస్తున్నాయి. ఇప్పటికే గత నవంబరులో కొంతమంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన అమెజాన్.. తాజాగా 18 వేలమంది ఉద్యోగులను ఇంటికి పంపేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కంపెనీ ఉద్యోగులకు రాసిన లేఖలో అమెజాన్ సీఈఓ ఆండీ జెస్సీ పేర్కొన్నారు.
ఇది చాలా కష్టమైన నిర్ణయమని తెలిసినప్పటికీ.. తప్పడం లేదని తెలిపారు. గత నవంబర్‌లో 10వేలమంది ఉద్యోగులను తొలగించినట్లు అమెజాన్ ప్రకటించింది. తొలగించిన ఉద్యోగులకు అన్ని రకాల ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. 5 నెలల జీతం, ఆరోగ్య బీమా, ఇతర ఉద్యోగాల్లో చేరేందుకు సహాయం అందిస్తున్నట్లు వివరించారు. కంపెనీ చరిత్రలోనే ఇంత భారీగా ఉద్యోగాలు తొలగించడం ఇదే తొలిసారి అని తెలిపారు.
వేటు అందుకే..
తొలగించిన ఉద్యోగాలు ఎక్కువగా ఐరోపాలో ఉంటాయని తెలుస్తోంది. ఈనెల 18 నుంచి తొలగించిన ఉద్యోగులకు సమాచారం అందిస్తామని జెస్సీ తెలిపారు. కంపెనీలో పనిచేసే ఉద్యోగుల్లో ఒకరు ఈ విషయాన్ని బహిర్గతం చేసినందున.. అకస్మాత్తుగా ప్రకటన చేసినట్లు పేర్కొన్నారు.
కరోనా సమయంలో డిమాండ్‌కు అనుగుణంగా భారీగా ఉద్యోగులను నియమించుకున్నట్లు తెలిపిన అమెజాన్.. ప్రస్తుతం ఖర్చులు తగ్గించుకునేందుకు కొంతమందిపై వేటు వేయక తప్పడం లేదని వెల్లడించింది. గత సెప్టెంబర్ నెలాఖరు నాటికి ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ సంస్థలో 15 లక్షల 40 వేలమంది పనిచేస్తున్నారు.