2000 Currency Notes Return Amount : రెండు వేల రూపాయల నోట్లలో 88శాతం తిరిగి బ్యాంకులకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. వీటి విలువ 3 లక్షల 14 వేల కోట్ల రూపాయలని తెలిపింది. ప్రస్తుతం రూ.42 వేల కోట్లు విలువ చేసే రెండు వేల రూపాయల నోట్లు మార్కెట్‌లో చలామణీలో ఉన్నాయని వెల్లడించింది. వెనక్కి వచ్చిన రెండు వేల నోట్లలో 87 శాతం డిపాజిట్ రూపంలో, 13 శాతం నోట్ల మార్పిడి ద్వారా ప్రజలు నగదు మార్చుకున్నారని ఆర్బీఐ పేర్కొంది. మార్చి 31 నాటికి రూ.3 లక్షల 62 వేల కోట్లు విలువ చేసే రెండు వేల రూపాయల నోట్లు మార్కెట్‌లో చలామణీలో ఉన్నాయని తెలిపింది. 2 వేల రూపాయల నోట్ల మార్పిడికి ఇంకా రెండు నెలలు గడువు ఉన్నందున ప్రజలు చివరి నిమిషంలో బ్యాంక్‌లకు వచ్చి ఇబ్బందులు పడవద్దని ఆర్బీఐ ప్రజలకు సూచించింది. 2023 సెప్టెంబర్ వరకు నోట్లు మార్చుకునేందుకు అవకాశం ఉందని గుర్తు చేసింది.
అందుకే రూ.2వేల నోట్ల ఉపసంహరణ.. : ఆర్బీఐ గవర్నర్
2000 Note Withdrawn : నగదు నిర్వహణ కార్యకలాపాల్లో భాగంగానే రూ.2వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ కొద్ది రోజుల క్రితం తెలిపారు. నిర్దేశిత గడువు అయిన సెప్టెంబర్ 30లోపు రూ.2వేల నోట్లు అన్నీ వెనక్కు వచ్చేస్తాయని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. రూ.2వేల నోట్ల చట్టబద్ధత మాత్రం కొనసాగుతుందని అప్పుడు ఆయన స్పష్టం చేశారు. రూ.2వేల నోట్ల డిపాజిట్ సమయంలో రూ. 50వేలు మించితే పాన్ కార్డు తప్పనిసరి అని వివరించారు. రూ.2వేల నోట్ల ఉపసంహరణ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై చాలా తక్కువగా ఉంటుందని శక్తికాంతదాస్ విశ్లేషించారు. 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత మార్కెట్లో కొరతను అధిగమించేందుకే రూ.2 వేల నోట్లను ప్రవేశపెట్టినట్లు ఆయన వ్యాఖ్యానించారు. పలు దేశాల్లో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ, కొన్ని అమెరికా బ్యాంకులు సమస్యల్లో చిక్కుకున్నప్పటికీ.. భారత కరెన్సీ నిర్వహణ వ్యవస్థ చాలా సమర్థంగా ఉందని పేర్కొన్నారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రూ.2వేల నోట్లను మార్చుకునేందుకు నిబంధనలు..
2000 Note Exchange Rules : రూ.2వేల నోట్లు డిపాజిట్ లేదా మార్పిడి చేసుకున్నప్పుడు ఎలాంటి గుర్తింపు పత్రం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎటువంటి ఫామ్ నింపాల్సిన అవసరం కూడా లేదు. ఒకసారి గరిష్ఠంగా 20 వేల రూపాయలు విలువ చేసే రూ. 2వేల నోట్లు డిపాజిట్ చేయటం లేదా మార్పిడి చేసుకోవచ్చు. దీనిపై పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.