దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ రంకెలు కొనసాగాయి. సూచీలు మరోసారి జీవితకాల గరిష్ఠాలకు ఎగబాకాయి.
బుధవారం నాటి ట్రేడింగ్లో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 46 వేల మార్క్ దాటింది. 495 పాయింట్లు ఎగబాకి... 46,104 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం అదే జోరు కనబర్చింది. 136 పాయింట్ల లాభంతో 13,529 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించింది. రెండు సూచీలకు ఇది జీవితకాల గరిష్ఠ స్థాయి కావడం విశేషం.
లాభనష్టాల్లోనివివే
సెన్సెక్స్ షేర్లలో ఏషియన్ పెయింట్స్, కోటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, ఇన్ఫోసిస్, రిలయన్స్ లాభాలు నమోదు చేశాయి.
అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, మారుతీ, టెక్ మహీంద్ర షేర్లు నష్టాలపాలయ్యాయి.
బుల్ జోరుకు కారణమిదే!
వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం వల్ల వీలైనంత త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నాయన్న విశ్లేషణల నేపథ్యంలోనే సూచీలు దూసుకెళ్తాయి. దీనికితోడు బ్యాంకింగ్, ఆర్థిక, ఐటీ షేర్లు రాణించడం సూచీలకు దన్నుగా నిలిచింది.