అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ చేసిన క్షిపణి దాడులు సహా 2019-20 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి 5 శాతానికే పరిమితం కానుందన్న ప్రభుత్వ అంచనాలు మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించాయి. గత ట్రేడింగ్‌లో లాభాలను గడించిన సూచీలు నేడు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 52 పాయింట్లు కోల్పోయి 40,817 వద్ద ముగిసింది. ఓ దశలో 400 పాయింట్లు పతనమైన సూచీ... అనంతరం కోలుకొని స్వల్ప నష్టాలతో ముగించింది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 28 పాయింట్లు పతనమై 12,025 పాయింట్లకు చేరింది.
లాభాల్లోని షేర్లు
సెన్సెక్స్‌లోని ముప్పై షేర్లలో భారతీ ఎయిర్టెల్, టీసీఎస్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాలతో మగిశాయి. నేటి ట్రేడింగ్‌లో ఈ షేర్లన్నీ దాదాపు 2.74 శాతం రాణించాయి.
నష్టాల్లోని షేర్లు
ఎల్ అండ్ టీ షేర్లు అత్యధికంగా 2.19 శాతం నష్టపోయింది. ఓఎన్జీసీ, టైటాన్, సన్ ఫార్మా, హీరో మోటోకార్ప్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాలతో ముగిశాయి.
ముడి చమురు ధరలు 0.62 శాతం పెరిగాయి. బ్యారెల్ ముడిచమురు ధర 68.67 అమెరికన్ డాలర్లకు చేరుకుంది.
రూపాయి మారకం
నేటి ట్రేడింగ్‌లో రూపాయి స్వల్పంగా క్షీణించింది. ఓ దశలో 20 పైసలు కోల్పోయిన రూపాయి మారకం విలువ చివరకు కోలుకొని 3 పైసల నష్టాన్ని చవిచూసింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 71.78కి చేరుకుంది.
ఆసియా, ఐరోపా మార్కెట్లు
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు ఆసియా మార్కెట్లపైనా తీవ్రంగా ప్రభావం చూపించాయి. షాంఘై, హాంకాంగ్, టోక్యో, సియోల్ స్టాక్‌మార్కెట్లు 1.57 శాతం మేర నష్టపోయాయి. ఐరోపా మార్కెట్లు సైతం నష్టాల్లో కొనసాగుతున్నాయి.