Reasons For Stock Market Crash: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల నడుమ ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు అంతకంతకూ దిగజారుతున్నాయి. ఆసియా మార్కెట్ల పతనం, దిగ్గజ షేర్లలో అమ్మకాలు సూచీలను మరింత కిందకు లాగుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సెన్సెక్స్ 1500 పాయింట్లకుపైగా నష్టంతో, నిఫ్టీ 500 పాయింట్లు క్షీణించాయి.
పతనానికి ప్రధాన కారణాలివే..
- గతవారం అంతర్జాతీయంగా దాదాపు అన్ని మార్కెట్లు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. అమెరికా మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. నాస్‌డాక్ ఏకంగా ఇటీవలి గరిష్ఠాల నుంచి 16 శాతం కుంగడం గమనార్హం. ఈ ప్రభావం సూచీలపై గట్టిగా పడింది. దీంతో మార్కెట్లు నష్టాల బాట పట్టాయి.
- నాస్డాక్లో టెక్ స్టాక్‌లు భారీ నష్టాలను చవిచూడడం కూడా మదుపరులను ఆందోళనకు గురి చేసింది. ఈ ప్రభావం ఐటీ రంగంపై పడింది.
- మంగళవారం అమెరికాలో ఫెడ్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వడ్డీరేట్ల పెంపు తప్పదని ఇప్పటికే సంకేతాలిచ్చిన ఫెడ్.. దాన్ని ఎంత వేగంగా.. ఎన్ని దశల్లో అమలు చేయనుందో ఈ భేటీ స్పష్టం చేయనుంది. ఇదే జరిగితే మార్కెటింగ్ వ్యవస్థపై గట్టి ప్రభావం పడుతుందని నిపుణులు చెప్తున్నారు. దీంతో పెట్టుబడిదారులు అమ్మకాలకు మొగ్గు చూపుతున్నారు.
- ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలోనూ ఫెడ్ వడ్డీరేట్ల పెంపు వాయిదా లేకపోవడం కూడా మదుపర్లను కలవపరుస్తోంది.
- అమెరికాలో నిరుద్యోగం పెరగడం కూడా సూచీలు నష్టాలకు కారణం అయ్యింది.
- రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న వివాదంపైనా మదుపర్లు దృష్టి పెట్టారు. యుద్ధ మేఘాలు కమ్ముకొన్న నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని రాయబార కార్యాలయ సిబ్బందిని అమెరికా తగ్గించింది.
- విదేశీ సంస్థాగత మదుపర్లు ఏకంగా రూ.12,600 కోట్లకు పైగా అమ్మకాలు దిగారు. దేశీయ మదుపర్లు సైతం అదే బాటలో పయనిస్తున్నారు.
- గత ఏడాది కొత్తగా లిస్టయిన కంపెనీలన్నీ భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. లిస్టింగ్‌లో అదరగొట్టిన జొమాటో వంటి షేర్లు ఇష్యూ ధర కంటే 10 శాతం కింద ట్రేడవుతుండడం గమనార్హం. ఇక పేటీఎం షేరు ఏకంగా 50 శాతం నష్టంతో కొనసాగుతోంది.
- ఐటీ, లోహ, ఫార్మా, రియాల్టీ రంగాల షేర్లు మూకుమ్మడిగా డీలా పడటం వల్ల మార్కెట్లు మరింత నష్టాల్లోకి జారుకున్నాయి.
- ముప్పై షేర్ల ఇండెక్స్ కూడా పూర్తి స్థాయిలో ఎరుపు రంగు పులుముకోవడం గమనార్హం.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: అద్దె విమానాలపై కొవిడ్ దెబ్బ.. ఎన్నికలున్నా గిరాకీ అంతంతే!