స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్.. ప్రస్తుతం 500 పాయింట్ల నష్టంతో 50,280 వద్ద ట్రేడవుతోంది.
మరోవైపు, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ సైతం భారీ నష్టాల్లో పయనిస్తోంది. 145 పాయింట్లు పతనమై... ప్రస్తుతం 14,880 వద్ద కదలాడుతోంది.
లాభనష్టాల్లోనివివే
బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లు డీలా పడ్డాయి. సెన్సెక్స్ 30 షేర్లలో అత్యధికంగా యాక్సిస్ బ్యాంక్ 2.19 శాతం పతనమైంది. ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, రిలయన్స్ షేర్లు నష్టాల్లో సాగుతున్నాయి.
పవర్‌గ్రిడ్, టెక్ మహీంద్ర స్వల్ప లాభాల్లో పయనిస్తున్నాయి.
కారణాలు!
సీపీఐ పెరుగుదల, పారిశ్రామిక ఉత్పత్తి పడిపోవడం వంటివి మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసినట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా ప్రభుత్వ బాండ్లపై వచ్చే రాబడి పెరగడం, కరోనా కేసులు వంటివి కూడా నష్టాలకు కారణమని స్పష్టం చేస్తున్నారు.
ఆసియా మార్కెట్లు
ఆసియాలోని మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. షాంఘై, సియోల్ స్టాక్ ఎక్స్ఛేంజీలు నష్టాల్లో ఉండగా.. హాంకాంగ్, టోక్యో మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
ముడిచమురు
అంతర్జాతీయంగా చమురు ధరలు 0.74 శాతం పెరిగాయి. దీంతో బ్యారెల్ చమురు ధర 69.73 డాలర్లకు చేరింది.