స్టాక్ మార్కెట్లను ఈ వారం.. స్థూల ఆర్థిక గణాంకాలు(జులై నెలకు సంబంధించి), ఆర్బీఐ ఎంపీసీ నిర్ణయాలు, కంపెనీల త్రైమాసిక ఫలితాలు ముందుకు నడిపించనున్నాయంటున్నారు నిపుణులు. అంతర్జాతీయ పరిణామాలు, వ్యాక్సినేషన్ ప్రభావం కూడా మార్కెట్లపై ప్రధానంగా ఉండనున్నట్లు చెబుతున్నారు.
'ఈ వారం వెలువడనున్న ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు మార్కెట్లకు కీలకం కానున్నాయి. ఆర్థిక పునరుద్ధరణ స్థాయిని తెలిపే తయారీ, సేవా రంగ పీఎంఐ డేటా కూడా కీలకమే.' అని జియోజిత్ ఫినాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగాధిపతి వినోద్ నాయర్ పేర్కొన్నారు.
ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ద్వైమాసిక సమీక్ష ఆగస్టు 4న ప్రారంభం కానుంది. మూడు రోజుల సమీక్ష అనంతరం 6వ తేదీన కమిటీ నిర్ణయాలు వెలువడనున్నాయి.
ఈ వారం క్యూ1 ఫలితాలు ప్రకటించే కంపెనీలు..
ఈ వారం 2021-22 క్యూ1 ఫలితాలు ప్రకటించే కంపెనీల జాబితాలో.. ఎస్బీఐ, ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ, పీఎన్పీ, అదానీ పోర్ట్స్, ఎం&ఎం ప్రధానమైనవి. ఆయా కంపెనీల షేర్లపై ఫలితాల ప్రభావం ఎక్కువగా ఉండనుంది.
వీటన్నింటితో పాటు ముడి చమురు ధరలు, దేశీయంగా కరోనా కేసులు, రూపాయి హెచ్చుతగ్గులు కూడా స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపే సాధారణ అంశాలుగా ఉండనున్నాయి.
ఇదీ చదవండి: చిన్న పట్టణాల నుంచీ స్టాక్మార్కెట్లోకి పెట్టుబడులు'