మీకు గ్రాట్యుటీ గురించి ఏమైనా తెలుసా? పదవీ విరమణ సమయంలో మీరు దీనిని పొందుతారు. ఇది మీ జీతంలో ఒక భాగం. చాలా మంది ఉద్యోగులకు గ్రాట్యుటీ అంటే ఏమిటో తెలియదు. దీనిపై పన్ను మినహాయింపు ఉంటుందన్న విషయం అసలే తెలియదు. అలాంటి వారి కోసం గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీన్ని ఎలా లెక్కిస్తారు? దీనిలో ఎంత మొత్తానికి పన్ను మినహాయింపు వర్తిస్తుంది? సహా గ్రాట్యుటీకి సంబంధించి సమగ్ర సమాచారం తెలుసుకుందాం పదండి.
గ్రాట్యుటీ అంటే ఏమిటి?
ఒక సంస్థలో నమ్మకంగా పనిచేస్తూ, 5 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు సేవలందించినందుకు గాను తమ ఉద్యోగికి సంస్థ డబ్బు రూపంలో ఇచ్చే బహుమతినే గ్రాట్యుటీ అంటారు.
ఒక్కో దేశానికీ ఒక్కో విధంగా గ్రాట్యుటీ పరిమితులు ఉన్నాయి. భారతదేశంలో ఈ పరిమితి రూ.10 లక్షలుగా ఉంది. అయితే 7వ వేతన సవరణ చట్టం అమలు తరువాత ఈ పరిమితిని రూ. 20 లక్షలకు పెంచారు. ప్రభుత్వేతర రంగాలలో 5 సంవత్సరాలుగా ఒకే సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ నిర్ణయంతో లబ్ధి చేకూరుతుంది.
గ్రాట్యుటీ చెల్లింపు విధానం
ఉద్యోగ భవిష్య నిధి(ఈపీఎఫ్) మాదిరిగానే గ్రాట్యుటీ కూడా పూర్తిగా యజమానే చెల్లిస్తాడు. సంస్థ యజమానే నేరుగా గ్రాట్యుటీ మొత్తాన్ని మీకు చెల్లించడం గానీ బీమా సంస్థతో కలిసి గ్రూప్ గ్రాట్యుటీ ప్లాన్ను ఇవ్వడం అనే నిర్ణయాలు యజమానిపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ బీమా సంస్థ ద్వారా చెల్లించినట్లయితే, ఉద్యోగి కూడా తన గ్రాట్యూటీ కోసం కొంత మొత్తాన్ని కాంట్రిబ్యూట్ చేయవచ్చు. అది ఐచ్ఛికంగా మాత్రమేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
గ్రాట్యుటీని ఎలా లెక్కించాలి?
మీరు ఒక సంస్థలో 5 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన తర్వాత, సంవత్సరానికి 15 రోజులు చొప్పున గ్రాట్యుటీ లెక్కలోకి వస్తుంది.
పరిగణించవలసిన మొత్తం పని దినాల సంఖ్య 26. మీరు ఉద్యోగం చేసిన సంవత్సరాల ఆధారంగా ఈ గణాంకాలు ఉంటాయి.
మీ ఉద్యోగ సర్వీస్ 6 నెలల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే, అప్పుడు అది ఒక సంవత్సరంగా పరిగణనలోకి తీసుకుంటారు. ఉదాహరణకు మీ ఉద్యోగ సర్వీస్ వ్యవధి 5 సంవత్సరాల 7 నెలలు ఉంటే, అప్పుడు ఇది 6 సంవత్సరాలుగా లెక్కిస్తారు.
గ్రాట్యుటీని లెక్కించేటప్పుడు పరిగణనలోకి తీసుకోవలసిన నిబంధనలు
చివరిగా తీసుకున్న జీతం (బేసిక్ పేతో కలిపి) అలాగే డియర్నెస్ భత్యం
మీ ఉపాధి సంవత్సరాల సంఖ్య
26 రోజులను పని దినాలుగా పరిగణనలోకి తీసుకుని సంవత్సరానికి 15 రోజుల జీతం చెల్లించడం
గ్రాట్యుటీని లెక్కించే ఫార్ములా
జీతం x పని చేసిన సంవత్సరాల సంఖ్య x (15/26)
జీతం = బేసిక్ తో కలిపి నెల జీతం + డీఏ
గ్రాట్యుటీ లెక్కింపునకు ఉదాహరణ
మీరు గత 5 సంవత్సరాల 7 నెలల నుంచి ఒక సంస్థలో ఉద్యోగం చేస్తున్నారనుకుందాం. దానికి గాను మీరు డీఏతో కలిపి నెలకు రూ. 50,000 జీతంగా పొందుతున్నారు. అప్పుడు మీ గ్రాట్యుటీ ఈ విధంగా ఉంటుంది.
50000 x6x15/26 = రూ.1,73,076.90
ఏ సమయంలో గ్రాట్యుటీ వస్తుంది?
గ్రాట్యుటీ అనేది పెన్షన్ లాంటిది. ఒకే సంస్థలో 5 లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసినట్లయితే, అలాంటి వారు గ్రాట్యుటీకి అర్హులు.
గ్రాట్యుటీ చెల్లింపు ప్రమాణాలు:
ఉద్యోగి పదవీ విరమణ చేసినప్పుడు.
5 సంవత్సరాల సర్వీస్ పూర్తైన తర్వాత ఉద్యోగి రాజీనామా చేసినప్పుడు.
ఏదైనా ప్రమాదం జరిగి మరణం లేదా శాశ్వత వైకల్యం సంభవించినప్పుడు.
5 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన వ్యక్తి ప్రమాదం కారణంగా మరణించినా లేదా శాశ్వత వైకల్యానికి గురైన సందర్భంలో యజమాని ప్రతి ఉపాధి సంవత్సరానికి గాను 15/26 రోజులు చొప్పున గ్రాట్యుటీ చెల్లించాల్సి ఉంటుంది.
ఏ కంపెనీలు గ్రాట్యుటీని చెల్లించాల్సి ఉంటుంది?
గ్రాట్యుటీ చట్టం 1972లో ఆమోదిం పొందింది. ఈ చట్టం కర్మాగారాలు, గనులు మొదలైన కంపెనీలలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులకు వర్తిస్తుంది. ఈ చట్టం ప్రకారం కనీసం 10 మంది ఉద్యోగులు ఉన్న సంస్థలు గ్రాట్యుటీని చెల్లించాల్సి ఉంటుంది.
గ్రాట్యుటీని పొందేందుకు ఎవరు అర్హులు?
ఉద్యోగి గ్రాట్యుటీని పొందేందుకు అర్హత సంపాదించడానికి మూడు ప్రమాణాలు ఉన్నాయి:
ఉద్యోగి సంస్థలో 5 సంవత్సరాల సర్వీసును పూర్తి చేసి, తర్వాత పదవీ విరమణ చేసిన వారికి గ్రాట్యుటీ వర్తిస్తుంది.
ఉద్యోగి అదే సంస్థలో 5 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి, తర్వాత రాజీనామా చేసినా వర్తిస్తుంది.
ఉద్యోగి సంస్థలో పని చేస్తున్నప్పుడు, ప్రమాదవశాత్తు చనిపోయినా, శాశ్వత వైకల్యానికి గురైన వారు.
సెక్షన్ 4 (2) నిబంధన ప్రకారం ఈ ప్రమాణాలను సంతృప్తిపరిచే ఉద్యోగి గ్రాట్యుటీకి అర్హులు
కంపెనీకి 6 పని దినాలు ఉన్నట్లయితే, ఉద్యోగి సంవత్సరానికి 240 రోజులు పనిచేయాలి.
ఒకవేళ కంపెనీకి 5 పని రోజులు మాత్రమే ఉన్నట్లయితే, ఉద్యోగి సంవత్సరానికి 190 రోజులు పనిచేయాలి.
ఉద్యోగి సంస్థలో పనిచేస్తున్నప్పుడు చనిపోయినా, శాశ్వత వైకల్యానికి గురైనట్లయితే ఈ నిబంధన వర్తించదు. ఆ సందర్భంలో సదరు సంస్థ ఉద్యోగికి గ్రాట్యుటీని అందిస్తుంది.
గ్రాట్యుటీకి పన్ను వర్తిస్తుందా?
ప్రస్తుత పరిస్థితిలో అందరు ప్రభుత్వ ఉద్యోగులకు గ్రాట్యుటీపై పన్ను మినహాయింపు ఉంది. రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ లేదా ప్రభుత్వం కింద పనిచేస్తున్న స్థానిక సంస్థలలోని ప్రభుత్వ ఉద్యోగులకు అందుతున్న గ్రాట్యుటీ మొత్తం మీద పన్ను ఉండదు.
ప్రభుత్వేతర సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులకు అందుతున్న గ్రాట్యుటీ మొత్తానికి పన్ను మినహాయింపు అనేది యజమాని సంస్థ గ్రాట్యుటీ చట్టం కింద కవర్ అయ్యిందా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది.
1. యజమాని గ్రాట్యుటీ చెల్లింపు చట్టం కింద కవర్ అయినట్లయితే
ఒక వ్యక్తి ప్రైవేటు సంస్థలో పని చేస్తన్నా.. తన సంస్థ గ్రాట్యుటీ చెల్లింపు చట్టం కింద కవర్ అయినట్లయితే, అతను తన సగం నెల జీతంపై పన్ను మినహాయింపు పొందవచ్చు. అంటే అతని ఉద్యోగ సమయంలో ప్రతి సంవత్సరం 15 రోజుల జీతం.
2. యజమాని గ్రాట్యుటీ చెల్లింపు చట్టం కింద కవర్ అవ్వకపోయినట్లైతే
మీరు పనిచేస్తున్న సంస్థ గ్రాట్యుటీ చట్టం కింద కవర్ అవ్వకపోయినట్లైతే, మీరు కింద ఇచ్చిన మూడు ఎంపికలలో ఏదైనా ఒక పన్ను మినహాయింపును పొందవచ్చు. వాటిలో ఏది తక్కువగా ఉంటే దాని మినహాయింపు పరిగణనలోకి వస్తుంది.
- రూ. 20,00,000
- ఉద్యోగి అసలు గ్రాట్యుటీని అందుకున్నప్పుడు.
- ఉపాధి సమయంలో ప్రతి సంవత్సరం 15 రోజుల జీతం.
చివరగా..
గ్రాట్యుటీ అనేది రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలు పెరగడమనేది ప్రైవేటు, పబ్లిక్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు మరింత లాభదాయకం. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం గ్రాట్యుటీ మొత్తంపై పన్ను మినహాయింపు పొందుతారు.
ఇదీ చూడండి:మాంద్యానికి మౌలిక చికిత్స.. పెట్టుబడుల మంత్రం ఫలిస్తుందా?