ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో నగదు బదిలీని ఇంటి వద్ద నుంచే చేయొచ్చు. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు.. యూపీఐ, ఐఎంపీఎస్, నెఫ్ట్, ఆర్టీజీఎస్ వంటి సదుపాయాలను వినియోగించుకోవాల్సి ఉంటుంది.
పేమెంట్స్ చేసేందుకు ఇన్ని మార్గాలున్నప్పటికీ అవన్నీ అన్ని పరిస్థితుల్లో ఉపయోగపడవు. కొన్ని పేమెంట్స్ వెంటనే అయిపోతే మరికొన్ని ఆలస్యంగా అవుతాయి. కొన్నింటికి ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్ అవసరం అవుతాయి. యూపీఐ ద్వారా పేమెంట్స్ కోసం కేవలం మొబైల్ నంబర్ ఉంటే సరిపోతుంది. కొన్నింటిని పెద్ద వ్యాపారులు ఉపయోగిస్తే.. కొన్నింటిని చిన్న వ్యాపారులు వాడుతుంటారు.
మరీ ఈ పేమెంట్ వ్యవస్థల మధ్య తేడాలు ఏంటి? ఏది ఎలాంటి అవసరాలకు ఉపయోగపడుతుంది? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
యూపీఐ(యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్)
- ఇది 2016లో ప్రారంభమైంది.
- 24 గంటలూ పని చేస్తుంది.
- నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) అభివృద్ధి చేసింది.
- ఒక రోజులో 20 నగదు చెల్లింపులు చేసుకోవచ్చు. (బ్యాంకును బట్టి ఈ సంఖ్య మారవచ్చు.)
- ఒక రోజులో యూపీఐ ద్వారా గరిష్ఠంగా రూ. 1 లక్ష వరకు బదిలీ చేసుకోవచ్చు. పరిమితిని తగ్గించే అధికారం బ్యాంకులకు ఉంటుంది.
- ఇందులో పేమెంట్స్ తక్షణమే అవుతాయి.
- చిన్న మొత్తంలో మర్చంట్ పేమెంట్స్, నగదు బదిలీలకు ఇది ఉపయోగపడుతుంది.
- బ్యాంకు ఖాతా నంబరు, ఐఎఫ్ఎస్సీ కోడ్ అవసరం లేకుండా కేవలం వర్చువల్ ఐడీతో నగదు బదిలీ చేయొచ్చు. వివిధ యాప్‌లలో మొబైల్ నంబరు ఆధారంగా కూడా చెల్లింపులు చేయొచ్చు.
ఐఎంపీఎస్ (ఐఎంపీఎస్ అంటే ఇమీడియెట్ పేమెంట్ సర్వీస్)
- ఆర్బీఐ దీనిని 2010లో తీసుకొచ్చింది. (తక్షణమే ఈ పద్ధతిలో పేమెంట్స్ పూర్తవుతాయి.)
- ఈ పద్ధతి ద్వారా కూడా 24x7 చెల్లింపులు, బదిలీలు చేయొచ్చు.
- దీనిని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ పర్యవేక్షిస్తుంది.
- ఐఎంపీఎస్‌కు ఖాతా నంబరు, ఐఎఫ్ఎస్సీ లాంటి వివరాలు కావాలి. మొబైల్ ద్వారా చెల్లింపులు చేస్తున్నట్లయితే ఫోన్ నంబర్, ఎంఎంఐడీ కావాలి.
- ఐఎంపీఎస్ ద్వారా గరిష్ఠంగా రూ. 2 లక్షల బదిలీ చేయొచ్చు.
నెఫ్ట్(నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ ఫర్)
- 2005లో ఇది అందుబాటులోకి వచ్చింది.
- ఇందులో చెల్లింపులకు కనీస మొత్తం లేదు. గరిష్ఠ పరిమితి రూ.10 లక్షలుగా ఉంది.
- ఈ పద్ధతిలో బదిలీ చేయాలంటే బ్యాంకు ఖాతా నంబరు, ఐఎఫ్ఎస్సీ కోడ్ ఉండాలి.
- క్రెడిట్ కార్డు పేమెంట్స్, ఈఎంఐ, లోన్ పేమెంట్స్ వంటి అవసరాలకు నెఫ్ట్‌ను ఉపయోగించుకోవచ్చు.
- 2019 డిసెంబర్ నుంచి 24x7 నెఫ్ట్ సేవలు అందుబాటులో ఉంటున్నాయి.
- ఈ చెల్లింపులు రియల్ టైమ్‌లో కాకుండా బ్యాచ్‌లుగా జరుగుతుంటాయి. అంటే నగదు బదిలీ చేసిన అనంతరం కొంత సమయానికి అవతలి వ్యక్తి ఖాతాలో డిపాజిట్ అవుతాయి.
- ఛార్జీలు బ్యాంకును బట్టి మారుతూ ఉంటాయి.
ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్)
- 2004లో నుంచి ఇది అందుబాటులో ఉంది.
- ఆర్టీజీఎస్ తక్షణమే నగదు బదిలీ చేయొచ్చు.
- 2020 డిసెంబర్ నుంచి ఆర్టీజీఎస్ సేవలు 24x7 అందుబాటులోకి వచ్చాయి.
- ఈ పద్ధతి ద్వారా కనిష్ఠంగా రూ. 2 లక్షల నగదు బదిలీ చేయాల్సి ఉంటుంది. ఎలాంటి గరిష్ఠ పరిమితి లేదు.
- ఖాతా నంబరు, ఐఎఫ్ఎస్సీ కోడ్ లాంటి వివరాలు చెల్లింపుల కోసం కావాలి. దీనిని ఎక్కువ మొత్తం బదిలీ చేసే వ్యాపారులు, కంపెనీలు ఉద్యోగుల వేతనాల చెల్లింపునకు ఉపయోగిస్తుంటాయి.
ఇవీ చదవండి: