ఇంటి రుణం తీసుకున్నాక ఇంకే రుణం తీసుకోవడం వీలవుతుందా అని కొంత మంది అనుకుంటుంటారు. అయితే అదే రుణంపై మళ్లీ రుణం పొందే అవకాశం మీకు టాప్ అప్ లోన్ ద్వారా వస్తుంది.
టాప్ అప్ లోన్ అంటే?
టాప్ అప్ లోన్ పేరులో ఉన్నట్లు ఇప్పటికే రుణం తీసుకుని ఉండే దానిపై అదనంగా రుణం పొందటం. ఇదెలా సాధ్యం - ఒక సారి రుణం తీసుకున్నాక మళ్లీ రుణం తీసుకుందాం అంటే కుదురుతుందా! అది మీ అవసరం బట్టి ఉంటుంది. తప్పని పరిస్థితుల్లో రుణం తీసుకోవాలనుకుంటే మాత్రం టాప్ అప్ లోన్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో గృహరుణానికి వర్తించే వడ్డీ రేటు ఆధారంగా ఉంటుంది. కాబట్టి ఏలెక్కన చూసినా టాప్ అప్ లోన్ , పర్సనల్ లోన్ కంటే మేలే.
టాప్ అప్ లోన్ ఎలా ఇస్తారు?
దాదాపు అన్ని బ్యాంకులు ఈ సదుపాయాన్ని కలిపిస్తున్నాయి. గృహ రుణం చెల్లించడం మొదలైన 6 -12 నెలలకు టాప్ అప్ లోన్ తీసుకునేందుకు అవకాశం కలిపిస్తున్నాయి. ఇంటికి చాలా లోన్ తీసుకున్నాం కదా మళ్లీ లోన్ కావాలంటే బ్యాంకులు ఇస్తాయా అనే సందేహం వస్తుంది. అయితే ఇక్కడ లాజిక్ గమనిస్తే మీకు విషయం వివరంగా అర్థమవుతుంది. ఇదెలా అంటే మొత్తం తీసుకున్న గృహరుణం నుంచి తగ్గిన రుణాన్ని తీసివేస్తే వచ్చే మొత్తానికి టాప్ అప్ లోన్ ఇస్తారు. అయితే ఈ కాలంలో సదరు వ్యక్తులకు ఆదాయం పెరగడం ద్వారా రుణ మొత్తం పరిమితి పెరుగుతుంది.
ఈ అంశాన్ని ఒక ఉదాహరణతో వివరంగా తెలుసుకుందాం. హైదరాబాద్లో నివాసం ఉంటున్న సుమిత్ వార్షిక వేతనం రూ.10 లక్షలు. అతను ఇంటి రుణం తీసుకుందామని బ్యాంకుకు వెళ్తే అక్కడ ఆయనకు ఆయనకు రుణం రూ.50 లక్షల వరకు తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. ఆయన రూ.45 లక్షలకు రుణం తీసుకున్నారు. మూడేళ్ల పాటు ఈఎంఐలు చెల్లించారు. కొంత కాలానికి అతని రుణం రూ.38 లక్షలకు చేరింది. అతని వేతనం రూ.12 లక్షలు అయింది. అప్పటికి రుణం పొందే పరిమితి అతనికి 55 లక్షలకు పెరిగింది. ఇక్కడ మొత్తం రుణం పరిమితి పెరగడం, అప్పటికే తీసుకున్న రుణం తగ్గడం వల్ల కిరణ్ టాప్ అప్ లోన్ తీసుకునేందుకు అర్హత పొందాడు.
టాప్ అప్ రుణం లెక్కింపు ( రూ. 55 లక్షలు - రూ.38 లక్షలు = రూ.17లక్షలు )
ఈ అవసరాలకు టాప్ అప్ లోన్:
- ఇంటి పునరుద్ధరణ
- వ్యక్తిగత రుణం
- మరొక ఆస్తిని కొనటానికి
- భూమి కొనుగోలు
- వినియోగ వస్తువుల కొనుగోలు
- పిల్లల వివాహం / విద్య
- వ్యాపార అవసరాలు
- వైద్య ఖర్చులు
పన్ను మినహాయింపు పొందాలంటే?
టాప్అప్ లోన్ పై పన్ను మినహాయింపు పొందాలంటే ఆ రుణాన్ని ఇంటి పునరుద్ధరణకు ఖర్చు చేస్తేనే లభిస్తుంది.
వడ్డీ రేటు:
టాప్-అప్ లోన్ వడ్డీరేట్లు సాధారణంగా గృహ రుణ వడ్డీతో పోలిస్తే 0.5-1 శాతం వరకు ఎక్కువగా ఉంటాయి. గృహ రుణ వడ్డీ రేట్లు వార్షికంగా 6.7శాతం నుంచి 10.2 శాతం వరకు ఉంటాయి. వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు సాధారణంగా 10.65 శాతం నుంచి 24 శాతం వరకు ఉంటాయి. పసిడి రుణాలపై వడ్డీ రేట్లు 9.24 శాతం నుంచి 26 శాతం వరకు ఉండే అవకాశం ఉంది.
తనఖా లేకుండా:
ఇక్కడ ఏవిధమైన ప్రత్యేక తనఖా లేకుండా రుణం పొందవచ్చు. అయితే ఇంటి రుణం తీసుకుంటే ఆ డాక్యుమెంట్లు బ్యాంకుల వద్దనే ఉంటాయి. కాబట్టి ఇంకేమీ తనఖా పెట్టనవసరం లేదు.
టాప్అప్ లోన్ మొత్తం:
ఈ టాప్ అప్ లోన్ పొందేందుకు రుణ చరిత్ర బాగుండాలి. మీకు రుణం తీసుకునే పరిమితి ఉన్నంత మాత్రాన రుణం లభించదు. మీ పాత చెల్లింపులు తదితరాలను బట్టి బ్యాంకులు రుణం మంజూరు చేస్తుంటాయి.
ప్రాసెసింగ్ ఫీజులు:
గృహ రుణం తీసుకునేందుకు అయ్యే ప్రాసెసింగ్ రుసుములే ఇక్కడ కూడా ఉంటాయి. ఉదాహరణకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు గృహరుణంపై తీసుకునే ప్రాసెసింగ్ ఛార్జీలు మొత్తం రుణలో 0.75 శాతం లేదా రూ. 2,000, రెండిట్లో ఏది ఎక్కువుంటే దాన్ని పరిగణిస్తారు.
ఇవీ చదవండి: