పెద్దనోట్ల రద్దు.. భారత ఆర్థిక వ్యవస్థను ఓ కుదుపునకు గురిచేసిన నిర్ణయం. 2016 నవంబర్ 8న రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేసిన సంచలన ప్రకటనతో.. అటు సామాన్యులతో పాటు.. ఇటు రాజకీయ నేతలూ ఒక్క సారిగా ఉల్లిక్కిపడ్డారు. ఈ సంచలన నిర్ణయానికి నేటితో సరిగ్గా.. మూడేళ్లు నిండాయి. నోట్లరద్దు నిర్ణయంతో జరిగిన మార్పులు.. అది సాధించిన విజయాలు, వైఫల్యాలను ఒక్క సారి గుర్తు చేసుకుందాం.
నల్లధనం వెలికితీతే ప్రధాన లక్ష్యం..
నల్ల ధనాన్ని వెలికితీయడమే ప్రధాన లక్ష్యంగా నోట్ల రద్దు నిర్ణయాన్ని తెరపైకి తెచ్చింది మోదీ సర్కారు. నల్ల ధనం చాలా వరకు రూ.500, రూ.1,000 నోట్ల రూపంలో నిల్వ ఉందని ప్రభుత్వం భావించింది. అందుకోసమే నోట్లను రద్దు చేస్తే.. ఆ ధనం అంతా వ్యవస్థలోకి వస్తుందని అంచనా వేసింది. అయితే ఎంత మేర నల్ల ధనం బయటికి వచ్చిందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రభుత్వ గణాంకాలు మాత్రం చాలా వరకు నల్ల ధనం వ్యవస్థలోకి వచ్చినట్లు చెబుతున్నాయి.
పన్ను చెల్లింపులు పెరిగాయి..
నోట్ల రద్దు తర్వాత తొలి ఏడాది.. పన్ను చెల్లించేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. కొత్తగా పన్ను పరిధిలోకి 56 లక్షల మంది వచ్చినట్లు అప్పటి అధికారిక గణాంకాల్లో తేలింది.
డిజిటల్ లావాదేవీల్లో వృద్ధి..
నల్లధనం వెలికితీతతో పాటు.. వ్యవస్థలో నగదు లావాదేవీలను తగ్గించి డిజిటల్ లావాదేవీలను పెంచాలని ప్రభుత్వం భావించింది. ఈ నిర్ణయం సత్ఫలితాలు ఇచ్చిందా అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి.
నోట్ల రద్దుతో చిల్లర వ్యాపారులు, వినియోగదారుల మధ్య డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. గత నాలుగేళ్లలో లావాదేవీలు 50 శాతం వృద్ధి చెందాయి. 2018-19లో ఈ లావాదేవీలు మరింత వృద్ధి చెందినట్లు ఆర్బీఐ ఇటీవల ఓ నివేదికలో పేర్కొంది.
వేగంగా లావాదేవీలు జరిపేందుకు తీసుకువచ్చిన యూనీఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) వినియోగమే ఇందుకు కారణమని పేర్కొంది ఆర్బీఐ. వీటికి తోడు స్మార్ట్ఫోన్ల వినియోగం పెరుగుతుండటమూ ఇందుకు ఊతమందించినట్లు వెల్లడించింది.
డొల్ల కంపెనీలకు షాక్...
3 లక్షలకు పైగా డొల్ల కంపెనీల అనుమానాస్పద లావాదేవీలపై నిఘా కొనసాగుతోంది. భారీగా డొల్ల కంపెనీలు మూతపడ్డాయి. స్టాక్ ఎక్స్చేంజ్లో వందల కొద్ది కంపెనీల నమోదు రద్దయింది.
బ్యాంకింగ్ వ్యవస్థలో..
2017లో బ్యాంకింగ్ వ్యవస్థలో డిపాజిట్లు రూ.3 లక్షల కోట్లకు పెరిగింది. వడ్డీ రేట్ల బేసిస్ పాయింట్లు తగ్గేందుకు ఉపయోగపడింది.
నకిలీనోట్లకు చెక్!
జమ్ముకశ్మీర్‌లో తీవ్రవాద దాడులు, రాళ్ల దాడులుతగ్గాయి. నక్సలైట్ల పైనా నోట్ల రద్దు ప్రభావం పడింది. హవాలా లావాదేవీలు సగానికి తగ్గాయి. పాకిస్థాన్‌లో ముద్రించిన నకిలీ నోట్ల మాఫియాకు ఎదురు దెబ్బ తగిలింది. రియల్ ఎస్టేట్ ధరలు తగ్గాయి.
నోట్లరద్దు ఓ గొప్ప నిర్ణయమని మోదీ ప్రభుత్వం ఇప్పటికీ సమర్థించుకుంటోంది. దాని ద్వారా వచ్చిన మార్పులు ఇప్పుడిప్పుడే వ్యవస్థలో కనిపిస్తున్నాయని చెబుతోంది.
నోట్ల రద్దు అతిపెద్ద తప్పిదం: విపక్షాలు
అయితే విపక్షాలు మాత్రం నోట్ల రద్దు నిర్ణయాన్ని ఇప్పటికీ ఓ తప్పుడు నిర్ణయమని విమర్శిస్తున్నాయి.
నోట్ల రద్దుతో దేశ జీడీపీ పడిపోయింది. వేలమంది ఉపాధి కోల్పోయారు. ప్రస్తుత దేశీయ స్థూల జాతీయోత్పత్తి తగ్గిందని ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా నల్ల ధనం ఎంత మేర వెలికితీశారనే లెక్కలు చూపించాలంటున్నాయి.
నోట్ల రద్దుతో జనాలు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారన్నాయి విపక్షాలు. సాధారణ జనం అప్పట్లో కనీస అవసరాలకు డబ్బు లేక ఇబ్బంది పడితే.. కొంత మందికి ఇంటి దగ్గరికే కొత్త నోట్లు వెళ్లాయని విమర్శించాయి.