గతేడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు వడ్డీ రేట్లను 250 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ద్రవ్యలభ్యత పెంచడం, ఆర్థిక స్థిరత్వం కాపాడేందుకు ఈ స్థాయిలో వడ్డీ రేట్లు తగ్గించినట్లు తెలిపారు. కరోనా సంక్షోభం వల్ల ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే.. 135 బేసిస్ పాయింట్ల వడ్డీ తగ్గించిన విషయాన్ని దాస్ గుర్తు చేశారు. ఎస్బీఐ బ్యాంకింగ్, ఎకనమిక్ కాంక్లేవ్‌లో పాల్గొన్న ఆయన ఈ విషయాలు చెప్పుకొచ్చారు.
మార్కెట్లో విశ్వాసం నింపేందుకు ద్రవ్య లభ్యత పెంచే దిశగా అనేక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. ఇప్పటి వరకు ఆర్‌బీఐ తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు ఫలితాలిస్తున్నాయని చెప్పారు దాస్.
''గడిచిన వందేళ్ల కాలంలోనే ఆరోగ్యం, ఆర్థిక పరంగా కొవిడ్-19 అతిపెద్ద సంక్షోభం. ఉపాధి, సహా ఉత్పత్తిపై ఇది ప్రభావం చూపింది. ప్రపంచవ్యాప్తంగా కార్మిక కారక్యకలాపాలు, పెట్టుబడులపై కరోనా సంక్షోభం తీవ్రంగా పడింది. ఈ సంక్షోభం వల్ల బ్యాంకులకు నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు)పెరగటం, మూలధనం వ్యయాల్లో తగ్గుదల వంటి సమస్యలు ఎదురుకావచ్చు.''
- శక్తికాంత దాస్, ఆర్‌బీఐ గవర్నర్.