2018-19లో 9 నెలల పాటు ప్రయాణ వాహనాలకు డిమాండ్ పడిపోగా... అన్ని కంపెనీల వాహనాల అమ్మకాల్లో వృద్ధి అంచనాల కంటే తక్కువగా నమోదైంది. మారుతి సుజుకీ, హుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా, టయోటా కంపెనీలు వృద్ధి 10 శాతం లోపే ఉంది.
అందుకోలేకపోయిన మారుతి..
దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ ఇండియా(ఎమ్ఎస్ఐ) 4.7 శాతం వృద్ధితో 2018-19లో 18.62 లక్షల కార్లను విక్రయించింది. ఒక సంవత్సరం అమ్మకాల పరంగా ఇదే గరిష్ఠం. 2017-18లో ఈ అమ్మకాలు 17.79 లక్షలుగా ఉన్నాయి. అయితే డిసెంబర్లో సవరించిన 8 శాతం అంచనానూ అందుకోలేకపోయింది మారుతి.
దేశీయంగా సంవత్సరం అమ్మకాల్లో కొత్త రికార్డును నెలకొల్పింది ఎమ్ఎస్ఐ. 6.1 శాతం వృద్ధితో 17.53 లక్షల కార్లు విక్రయించింది. 2017-18లో ఈ సంఖ్య 16.53 లక్షలుగా ఉంది.
ఇతర కంపెనీల పరిస్థితి ఇదే...
హుందాయ్ 2018-19లో 2.5 శాతం వృద్ధితో 7.07 లక్షల వాహనాలను విక్రయించింది. ఈ సంఖ్య 2017-18లో 6.90 లక్షలుగా ఉంది.
మహీంద్రా 2 శాతం వృద్ధితో 2.54 లక్షల యునిట్లు విక్రయించింది. 2017-18లో ఈ సంఖ్య 2.49 లక్షలు. భారత ఆటోమొబైల్ పరిశ్రమ క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ అన్నింటినీ కలిపినప్పుడు 11 శాతం వృద్ధి నమోదుచేసినట్లు ఎమ్ అండ్ ఎమ్ అధ్యక్షుడు తెలిపారు.
హోండా కార్స్ ఇండియా 8 శాతం వృద్ధితో 1.83 లక్షల వాహనాలను విక్రయించింది. 2017-18లో ఈ సంఖ్య 1.70 లక్షలుగా ఉంది. హోండా 4,794 కార్లు ఎగుమతి చేసింది.
2017-18లో 1.41 లక్షల కార్లు అమ్మిన టయోటా మోటార్స్ 7 శాతం వృద్ధితో 2018-19లో 1.50 లక్షల యునిట్లు విక్రయించింది.
ద్విచక్ర వాహనాలు...
దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ 78.20 లక్షల బైకులు విక్రయించినట్లు ప్రకటించింది. 2017-18లో ఈ సంఖ్య 75.87 లక్షలు.
సుజుకీ మోటార్ సైకిల్స్ 30 శాతం వృద్ధితో 7.47 లక్షల వాహనాలను విక్రయించింది. ఒక సంవత్సరంలో అమ్మకాల సంఖ్య పరంగా ఇదే గరిష్ఠం. అంతకుముందు ఏడాదిలో 5.74 లక్షల వాహనాలను విక్రయించింది సుజుకీ.