దేశీయ టెలికాం దిగ్గజం జియో మరో సంచలనానికి సిద్ధమవుతోంది. డిజిటల్ సేవలను కొత్త పుంతలు తొక్కించే శాటిలైట్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సేవలకు సన్నాహాలు చేస్తోంది.
లగ్జెంబర్గ్‌కు చెందిన సంస్థతో కలసి..
ఇందుకోసం లగ్జెంబర్గ్‌కు చెందిన ఎస్ఈఎస్ సంస్థతో జట్టుకట్టనున్నట్లు జియో ప్రకటించింది. ఈ మేరకు జియో,ఎస్ఈఎస్ సంస్థలు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. ఈ రెండు సంస్థలు కలిసి ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలు అందించేందుకు..జియో స్పేస్ టెక్నాలజీ లిమిటెడ్ పేరుతో కొత్త సంస్థను... ఏర్పాటు చేయనున్నాయి. ఇందులో జియోకు 51శాతం, ఎస్ఈఎస్కు 49 శాతం వాటా ఉంటాయని ఇరు సంస్థలు ప్రకటించాయి.
100 గిగాబైట్ల సామర్థ్యం..
జియో స్పేస్ టెక్నాలజీ లిమిటెడ్ సంస్థ ఎస్ఈఎస్కు చెందిన శాటిలైట్ డేటాను ఉపయోగించుకుని పనిచేస్తుంది. 100 గిగాబైట్‌ల సామర్ధ్యంతో సేవలు అందించే ఎస్ఈఎస్ వల్ల..జియో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటుందని సంయుక్త ప్రకటనలో ఇరుసంస్థలు వెల్లడించాయి. ఈ సంయుక్త భాగస్వామ్య సంస్థ ద్వారా జియో చేసే కొనుగోళ్ల కాంట్రాక్టు విలువ 100 మిలియన్ డాలర్లు ఉంటుంది.
5జీలోనూ పెట్టుబడులు..
ఫైబర్ ఆధారిత అనుసంధానతను..మరింత పెంచుకోవడం సహా 5జీలోనూ పెట్టుబడులు పెట్టనున్నట్లు జియో డైరెక్టర్ ఆకాశ్ అంబానీ వివరించారు. శాటిలైట్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సేవల ద్వారా మారుమూల పట్టణాలు, గ్రామాలకు సేవలు అందిస్తామని వివరించారు.
ఇదీ చదవండి: పుల్వామా అమరులకు మోదీ సహా ప్రముఖుల నివాళి