రుణం పొందేందుకు ఉన్న సులభమైన మార్గాలలో క్రెడిట్ కార్డులు ఒకటి. అందువల్ల వీటికి చాలా ప్రాధాన్యం ఉంది. అవసరమైనప్పుడు అదనపు నిధులను తీసుకోవడానికి మాత్రమే కాకుండా, రివార్డు పాయింట్లు బహుమతిగా లభిస్తాయి. క్రెడిట్ స్కోరును మెరుగుపరచుకోవడం ద్వారా ఇతర రుణాలను పొందడంలోనూ ఇవి సహాయపడతాయి. అయితే తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తేనే ప్రయోజనం ఉంటుంది. కాబట్టి క్రెడిట్ కార్డును ఉపయోగించేవారు బాధ్యతాయుతంగా ఉండాలని చెబుతుంటారు నిపుణులు. వడ్డీ రేట్లు అధికంగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం.
క్రెడిట్ కార్డులకు సాధారణ వడ్డీ రేటు..
సాధారణంగా క్రెడిట్ కార్డులకు 21- 42 శాతం మధ్య వార్షిక వడ్డీరేటు(యాన్యువల్ పర్సంటేజ్ రేటు-ఏపీఆర్) ఉంటుంది. దీనితో పోలిస్తే, 11-16 శాతం మధ్య ఉండే వ్యక్తిగత రుణాలు వార్షిక వడ్డీ రేటు తక్కువనే చెప్పాలి. క్రెడిట్ కార్డుల వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది క్రెడిట్ కార్డును మలిచిన విధానం. రెండవది లక్షణాలు, రుణాలు మంజూరు చేయడంలో ఉన్న వెలుసుబాట్లు.
క్రెడిట్ కార్డులు పునరావృత క్రెడిట్ మొత్తాన్ని అందిస్తాయి. అంటే ఖాతాదారుని ఆదాయాన్ని అనుసరించి రుణ సంస్థలు కొంత పరిమితి వరకు రుణం తీసుకునే సౌకర్యాన్ని అందిస్తాయి. దీంతో వినియోగదారులు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా పరిమితి మేరకు డబ్బు వాడుకోవచ్చు. అయితే వాయిదాల పద్ధతిలో, ప్రతీ నెలా నిర్ణీత మొత్తాన్ని, నిర్ణీత సమయంలో తిరిగి చెల్లించాల్సిన రుణాల మాదిరిగా కాకుండా, క్రెడిట్ కార్డు ద్వారా తీసుకునే రుణాలను తిరిగి చెల్లించే ప్రణాళికను ఎంచుకునే సౌలభ్యాన్ని అందిస్తున్నాయి.
రిస్క్ ఎక్కువ..
క్రెడిట్ కార్డు రుణాలు ఎంటువంటి హామీ లేకుండా తీసుకునే వీలున్నందువల్ల తిరిగి చెల్లించకుండా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల బ్యాంకులకు రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వడ్డీ రేట్లు అధికంగా ఉంటాయి.
రెండవది ఇతర రుణాలతో పోలిస్తే క్రెడిట్ కార్డు పొందేందుకు కావాల్సిన అర్హత ప్రమాణాలు తక్కువే. దీనికి తోడు వినియోగదారులు తమకు కేటాయించిన క్రెడిట్ లిమిట్ ఎప్పుడు, ఏవిధంగా ఉపయోగించుకుంటారో తెలియదు. అదేవిధంగా ఎంత తరచుగా కార్డు ఉపయోగిస్తారో, డబ్బు ఎక్కడ ఖర్చు చేస్తారో, ఎంత మేరకు ఉపయోగించుకుంటారో, ఎప్పుడు తిరిగి చెల్లిస్తారు తదితర విషయాలు కార్డు జారీ చేసేవారికి తెలియదు, ఊహించలేరు. ఈ అనూహ్యత కారణంగా రిస్క్ ఎక్కువగా ఉంటుంది.
ఈ ప్రమాదాల నుంచి మంత్లీ బిల్లింగ్ సైకిల్ ద్వారా ఉపశమనం పొందుతాయి కార్డు జారీ చేసే సంస్థలు. మంత్లీ బిల్లింగ్ సైకిల్ అంటే.. వినియోగదారుడు ప్రతీ నెల కొంత కనీస మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో చెల్లించాల్సిన మొత్తంపై వార్షిక వడ్డీ స్థానంలో నెలవారీగా వడ్డీని ఛార్జ్ చేస్తాయి కార్డు జారీ సంస్థలు. ఇది క్రెడిట్ కార్డును ఖరీదైనదిగా మారుస్తుంది.
కార్డు జారీ సంస్థలు.. క్రెడిట్ కార్డుకు వర్తించే వడ్డీ రేట్లను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కొన్ని సంస్థలు మంచి రుణ చరిత్ర, సరైన సమయానికి తిరిగి చెల్లింపులు చేసే వారికి అతి తక్కువ ఏపీఆర్(9 శాతం)కు క్రెడిట్ కార్డులు జారీ చేయాలని చూస్తున్నాయి. ఇలాంటి కేసుల్లో రిస్క్ తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. అందువల్ల మంచి క్రెడిట్ స్కోరు, చరిత్ర ఉన్నవారికి భవిష్యత్తులో చవకగానే క్రెడిట్ కార్డులు లభించే అవకాశాలు ఉన్నాయి.
ఇవీ చదవండి: