ఆదాయపన్ను రాయితీల కోసమో, రవాణాశాఖ అధికారులు చలాన్లు వేస్తారేమో? అనే ఉద్దేశంతో మాత్రమే చాలా మంది ఆరోగ్య, వాహన బీమా తీసుకుంటారు. దీనికి ముఖ్యకారణం వీటిని వారు అదనపు ఖర్చుగానే భావిస్తారు కానీ.. తప్పనిసరి అని భావించరు. కరోనాకు ముందు మనం బీమా ఉపయోగించకపోయినా.. ఏటా గంపగుత్తగా ఆరోగ్యబీమా ప్రీమియం కట్టేవాళ్లం. కానీ ఇకనుంచి కేవలం మనకున్న వ్యాధిని బట్టి ప్రీమియం కట్టుకునేలా పాలసీలు అందుబాటులోకి వచ్చాయని బీమా కంపెనీల నిపుణులు పేర్కొంటున్నారు.
కలపాలంటే.. అదనంగా కట్టేస్తే సరి
ఉదాహరణకు కరోనా వ్యాధి కోసం బీమా కంపెనీలు కొత్త ఆరోగ్యబీమా పాలసీలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. కొవిడ్ సమయంలో పాలసీ ఇచ్చే మొత్తాన్ని బట్టి ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టుకుంటే చాలని అభిప్రాయపడుతున్నారు. ఇది కాకుండా ఇప్పటికే ఉన్న ఇన్సూరెన్స్‌కు అదనంగా కాస్త ప్రీమియం జోడిస్తే కరోనాకు కవర్ అయ్యేలా పాలసీలలో మార్పులు తీసుకొచ్చారు. మున్ముందు మనకున్న వ్యాధులను అనుసరించి మాత్రమే బీమా కంపెనీలకు పాలసీలు అందజేస్తామని.. భవిష్యత్తుతో ఒకవేళ పాలసీలో లేని వ్యాధికి బీమా కావాలంటే.. దానికి అదనంగా బీమా చెల్లిస్తే చాలని వివరించారు.
వాహనాలకు వర్క్‌ఫ్రం హోమ్ వల్ల కష్టాలు
వాహన ప్రీమియం విషయంలోనూ ఇదే విధమైన మార్పులు చేకూరాయి. కరోనా కారణంగా అనేక కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ మేరకు దేశవ్యాప్తంగా ప్రజలు వాహనాలు నడిపే కిలోమీటర్ల సంఖ్య భారీగా పడిపోయింది. అన్‌లాక్ నిబంధనల వల్ల సడలింపు వచ్చినా.. చాలా మంది అవసరమైతేనే వాహనాలు బయటకు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో తాము వాహనాలు నడపకున్నా పూర్తి కాలానికి బీమా ఎందుకు కట్టాలని వాహనదారులు మదనపడుతున్నారు.
కొత్త కొత్త పథకాలతో
వాహనదారులను ఆకర్షించేందుకు బీమా సంస్థలు వినూత్నరీతిలో పథకాలను తీసుకొచ్చారు. ఇందులో వాహనం వాడిన కాలం వరకే మోటార్ ఇన్సూరెన్స్ కట్టే వెసులుబాటు కల్పించారు. ఇలాంటి పాలసీల వల్ల ఇప్పటివరకు బీమా భారమవుతోందని అనుకుంటున్న చాలామంది.. వాహనబీమా తీసుకుంటారని బీమా కంపెనీల నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండిః మరో ఉద్దీపనపై నిర్మలా సీతారామన్ ఏమన్నారంటే?