కరోనా సంక్షోభం నుంచి తేరుకుని దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి పరుగులు పెట్టాలంటే.. మౌలిక వసతుల రంగంలో భారీగా పెట్టుబడులు అవసరమని రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నిర్వహించిన సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న దాస్.. ఈ మేరకు వ్యాఖ్యానించారు.
వ్యవసాయ రంగంలో ఇటీవల తీసుకొచ్చిన సంస్కరణలు.. కొత్త అవకాశాలను భారీగా పెంచాయని దాస్ చెప్పుకొచ్చారు. అయితే వ్యవసాయం ద్వారా ఆదాయం పెంచేందుకు భారత్ మరిన్ని పథకాలను ప్రవేశపెట్టాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.
అమెరికా సహా ఇతర దేశాలతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలన్నారు దాస్.
ఫోరెక్స్ రేటు గురించి మాట్లాడుతూ.. రూపాయిపై ప్రస్తుతానికి ఎలాంటి లక్ష్యాలు లేవని తెలిపారు. అయితే భారీ ఒడుదుడుకులు ఎదురైతే మాత్రం పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేశారు.