దేశంలో కరోనా కట్టడికి రాష్ట్రాలు విధిస్తున్న కఠిన ఆంక్షల కారణంగా వ్యాపార రంగంలో రూ.5 లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అఖిల భారత వ్యాపారుల సమాఖ్య(సీఏఐటీ) వెల్లడించింది. ముంబయి, దిల్లీ సహా పలు నగరాలు, పట్టణాల్లో విధించిన ఆంక్షల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో క్రయవిక్రయాలు నిలిచిపోయి వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని తన నివేదికలో పేర్కొంది.
ఎవరెవరికి ఎంత నష్టం?
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రిటైల్ వ్యాపారులు రూ.3.5లక్షల కోట్లు, హోల్‌సేల్ వ్యాపారులు రూ.1.5లక్షల కోట్ల మేర నష్టపోయినట్లు అంచనా వేసింది సీఏఐటీ. పలు రాష్ట్రాల్లోని వర్తక సంఘాలతో సంప్రదింపుల అనంతరం ఈ నివేదిక రూపొందించింది.
80 శాతం తగ్గిన వినియోగదారుల సంఖ్య..
ఆంక్షల కారణంగా దుకాణాలకు వచ్చే వినియోగదారుల సంఖ్య 80 శాతం మేర పడిపోయినట్లు పేర్కొంది నివేదిక. దిల్లీలో వ్యాపారులు.. కేవలం 25 రోజుల వ్యవధిలో రూ.25వేల కోట్ల రూపాయల మేర వ్యాపారం కోల్పోయినట్లు తెలిపింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ ప్రమాదంలో పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండి:స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు