పండుగ సీజన్ నేపథ్యంలో ప్రతి ముగ్గురిలో ఒక భారత వృత్తి నిపుణుడు తమ వ్యక్తిగత ఆదాయంతో పాటు వృత్తిపరమైన రాబడి పెరుగుతుందని ఆశావాదంతో ఉన్నట్లు ఒ సర్వే తెలిపింది. ఆన్లైన్ ప్రొఫెషనల్ నెట్వర్క్ లింక్డ్ఇన్ చేసిన ఈ సర్వేలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి.
వర్క్ ఫోర్స్ కాన్ఫిడెంట్ ఇండెక్స్ 16వ సంచికలో భారత నిపుణుల విశ్వాసం స్థిరంగా పెరుగుతున్నట్లు పేర్కొంది నివేదిక. సెప్టెంబర్‌లో 45 పాయింట్ల వద్ద ఉన్న ఈ సూచీ తాజాగా 53 వద్దకు చేరిందని వివరించింది.
అక్టోబర్ 5 నుంచి నవంబర్ 1 మధ్య 2,022 మంది జెన్ ఎక్స్, మిలీనియల్స్ ప్రొఫెషనల్స్‌పై ఈ సర్వే జరిగింది.
సర్వేలోని మరిన్ని ముఖ్యాంశాలు..
- జెన్ ఎక్స్ వృత్తి నిపుణుల్లో 40 శాతం, మిలీనియల్స్ వృత్తి నిపుణుల్లో 41 శాతం మంది రానున్న ఆరు నెలల్లో తమ వృత్తిపరమైన, వ్యక్తిగత ఆదాయాలు, ఖర్చులు పెరుగుతాయని భావిస్తున్నారు.
- అన్ని తరాలకు చెందిన ప్రొఫెషనల్స్‌లో కరోనా కారణంగా ఇంటి నుంచి పని చేయడం వల్ల వారి భవిష్యత్ పురోగతిపై ఆందోళన వ్యక్తం చేశారు.
- లాక్డౌన్ సడలింపులతో తిరిగి కార్యాలయాలకు వెళ్తున్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో భద్రతపై చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి:తయారీ రంగంలోనే దేశ భవిత!