దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్న సమయంలో కరోనా విజృంభణ పిడుగుపాటులా పరిణమించింది. అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాకారం కావాలంటే ఇకపై పన్నెండు శాతం నుంచి పద్నాలుగు శాతం వార్షిక వృద్ధిరేటు నమోదు చేయాలి. కరోనా కల్లోలం వల్ల దేశాభివృద్ధి రేటు రెండు నుంచి మూడు శాతం సాధించడమూ కష్టమే. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో లాక్‌డౌన్ ఉన్నందువల్ల ప్రపంచ జీడీపీ ఖాయంగా 12 శాతానికి పైగా పతనం అవుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఆరోగ్యమే మహాభాగ్యమన్న నానుడిని అందరికీ గుర్తుచేస్తూ, అంటువ్యాధులు మనుషులతోపాటు ఆర్థిక వ్యవస్థలనూ బలహీనపరుస్తున్నాయి.
గతంలో ప్లేగు, సార్స్ వంటి అనేక రకాల మహమ్మారులు అంతర్జాతీయంగా అనేక దేశాలను ఆరోగ్యపరమైన సవాళ్లను విసిరాయి. వీటి ప్రభావం అప్పట్లో ఆర్థిక వ్యవస్థపై నామమాత్రంగానే ఉంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) ఏప్రిల్ నాలుగున ప్రకటించిన ప్రపంచ మహమ్మారి అనిశ్చితి సూచీ సైతం గతంలో వచ్చిన మహమ్మారులతో పోలిస్తే కరోనా ప్రభావం దేశాల ఆర్థిక వ్యవస్థలపై ఎక్కువగా ఉన్నట్లు స్పష్టీకరించింది. మార్చి 31నాటికి నమోదైన కరోనా రోగుల సంఖ్య, 2002-03లో వచ్చిన సార్స్ బాధితులకన్నా మూడురెట్లు ఎక్కువని, ఎబోలా కన్నా 20 రెట్లు అధికంగా ఉన్నట్లు ఐఎమ్‌ఎఫ్ తన నివేదికలో వివరించింది. 2008-09నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభంకన్నా పెద్దదిగా కరోనా ప్రభావం ఉంటుందని స్పష్టీకరించింది. విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాలంటే ఆర్థికంగా వెనకబడిన దేశాలకు కనీసం రెండున్నర లక్షల కోట్ల డాలర్లు అవసరమని ఐఎమ్‌ఎఫ్ సహా ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడింది.
వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒకదానితో మరొకటి పరస్పరం పెనవేసుకుపోయి గణనీయ స్థాయిలో ఏకీకరణ అయినట్లు కరోనా ప్రభావం తదనంతర పరిణామాలు సూచిస్తున్నాయి. ప్రపంచ ఏకీకరణ వల్ల సేవారంగం, పెట్టుబడులు, ఎక్సైజ్ రేటు, బ్యాంకింగ్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఎగుమతులు దిగుమతుల ద్వారా ఆర్థికవ్యవస్థలపై ప్రభావాన్ని చూపిస్తాయి. దాదాపు 200 పైచిలుకు కరోనా ప్రభావిత దేశాలు ఉండగా- ప్రపంచ గిరాకీలో చైనా, అమెరికా, ఇటలీ, కొరియా, జపాన్, జర్మనీ దేశాలు వాటాలో 55 శాతం, తయారీ రంగంలో సుమారు 60 శాతం భాగస్వామ్యం కలిగిఉన్నాయి. కనుక ఈ దేశాల ఆర్థిక వ్యవస్థల ప్రభావం మిగతా ప్రపంచ దేశాలపై తీవ్రంగా పడబోతోంది. దీన్ని ఎదుర్కోవడానికి వివిధ దేశాలు, వాటి కేంద్ర బ్యాంకులు, అంతర్జాతీయ సంస్థలు ప్రకటిస్తున్న సహాయక చర్యలు, 2008-09 ఆర్థిక సంక్షోభ సమయంలో ప్రకటించిన వాటికన్నా భారీగా ఉన్నాయి. అయినప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థలకు సూచీలైన స్టాక్ మార్కెట్లు అత్యంత కనిష్ఠ స్థాయికి చేరుకోవడం సమస్య తీవ్రతను తెలుపుతోంది.
భారత స్టాక్ మార్కెట్ మూడేళ్ల కనిష్ఠ స్థాయికి పతనమైంది. రూపాయి-డాలర్ మారకం రేటు 75 రూపాయల దిగువకు చేరింది. అమెరికా, యూకే, జపాన్ స్టాక్ మార్కెట్లూ పతనమయ్యాయి. భారత సెన్సెక్స్ సైతం 37శాతం (34,100 నుంచి 25,500) కనిష్ఠ స్థాయికి చేరింది. ఇదే సమయంలో అంతర్జాతీయ బ్యాంకుల షేర్ల విలువ గణనీయంగా పతనమైంది. సిటి గ్రూప్ వాటా విలువ 49 శాతం, జేపీ మోర్గాన్ వాటా 38 శాతం, బార్‌క్లీ షేర్‌ధర 52శాతానికి పడింది. మరోవైపు భారత దేశ ఎగుమతులూ కుదించుకుపోతున్నాయి. ఆటోమొబైల్స్, ఫార్మా వంటి దేశీయ పరిశ్రమలు చైనా నుంచి విడిభాగాలు, ముడిపదార్థాలను దిగుమతి చేసుకోలేక ఒత్తిడికి లోనవుతున్నాయి. మిగిలిన రంగాల్లో ముఖ్యంగా సమాచార సాంకేతికత(ఐటీ), పర్యాటకం, హోటల్, పౌర విమానయానం, ఆతిథ్య రంగం, కుటీర, సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలూ తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. లాక్‌డౌన్ వల్ల పారిశ్రామిక సర్వీసు రంగంతో పాటు వ్యవసాయరంగ ముడిసరకుల ధరలు అధికమై, ఉత్పత్తి వ్యయం పెరిగి, ఉత్పాదకతపై ప్రభావం చూపిస్తుంది.
కరోనా కోరలు సాచిన కొద్ది రోజుల్లోనే అమెరికాలో 60 లక్షలకు పైగా నిరుద్యోగులు నమోదైనట్లు అక్కడి అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. కష్టకాలంలో వ్యాపారులు, కార్మికులకు అండగా నిలవడానికి అమెరికా ప్రభుత్వం రెండు లక్షల కోట్ల డాలర్ల మేర సహాయక ప్యాకేజీని ప్రకటించింది. భారతదేశంలోనూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌తోపాటు కరోనా నష్టాన్ని పూడ్చడానికి అవసరమైన పథకాలతో ప్రజల ముందుకు వస్తున్నాయి. అయినా వలస కార్మికులు, అసంఘటిత రంగంలో పనిచేస్తూ ఉపాధి కోల్పోయినవారిని ఆదుకోవడానికి త్వరితగతిన కార్యాచరణను అమలు చేయాల్సిఉంది. నిరుద్యోగ భృతి ప్రకటన అవసరమూ కనిపిస్తోంది. రైతులకు మరింత సాయం అందజేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రణాళికలతో పాటు స్థానిక సంస్థలు గ్రామస్థాయిలో కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి. స్థానికంగా కరోనా ప్రబలితే స్థానిక సంస్థల క్రియాశీలతే కీలకమవుతుంది.
ఇదీ చూడండి:దేశంలో భారీగా తగ్గిన నియామకాలు.. కారణం ఇదే