మహమ్మారి విజృంభణతో పరిస్థితి మరింత ప్రతికూలంగా మారితే 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 7.7 శాతంగా ఉండే అవకాశం ఉందని ప్రముఖ ఆర్థిక సంస్థ బార్‌క్లేస్ అంచనా వేసింది. ఒకవేళ కరోనా థర్డ్ వేవ్ వచ్చి మరో ఎనిమిది వారాల పాటు లాక్‌డౌన్‌లు, కఠిన ఆంక్షలు అమల్లోకి వస్తే మరో 42.6 బిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లొచ్చని తెలిపింది.
ప్రస్తుత లాక్డౌన్ నష్టం..
తాజాగా అమల్లో ఉన్న కఠిన ఆంక్షలతో.. మే నెలలో వారానికి 8 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందని బార్‌క్లేస్ గతంలోనే అంచనా వేసింది. ఏప్రిల్‌లో ఈ నష్టం వారానికి 5.3 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు తెలిపింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలోనే ఆర్థిక నష్టం అత్యధికంగా ఉండనున్నట్లు పేర్కొంది. జూన్ నుంచి పరిస్థితులు కాస్త చక్కబడే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
'అత్యంత ప్రతికూల పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే కరోనా మరోసారి విజృంభించే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో రెండు నెలల పాటు ఆంక్షలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. మూడు, నాలుగు త్రైమాసికాల మధ్య భాగంలో ఈ పరిస్థితి తలెత్తొచ్చని భావిస్తున్నాం. దీంతో కరోనా మూలంగా కలిగిన ఆర్థిక నష్టం 117 బిలియన్ డాలర్లు.. జీడీపీలో 3.75 శాతానికి చేరొచ్చని అంచనా వేస్తున్నాం' అని బార్‌క్లేస్ చీఫ్ ఇండియా ఎకానమిస్ట్ రాహుల్ బజోరియా పేర్కొన్నారు.
అంచనాలు తారుమారు..
ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం చూస్తే మాత్రం ఈ ఆర్థిక సంవత్సరం దేశ జీడీపీ 9.2 శాతంగా బార్‌క్లేస్ అంచనా వేసింది. గతంలో దీన్ని 10 శాతంగా లెక్కగట్టిన సంస్థ రెండో దశ విజృంభణ నేపథ్యంలో దాన్ని తగ్గించింది. ఇక ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 21.6 శాతంగా ఉంటుందని గతంలో పేర్కొనగా.. తాజాగా దాన్ని 15.4 శాతానికి సవరించింది.
ఇవీ చదవండి: