గృహరుణం ఈఎంఐను నిర్ణయించేవి ప్రధానంగా రెండు అంశాలు.. మొదటిది వడ్డీ రేటు, రెండు చెల్లింపులకు ఎంచుకునే కాలపరిమితి. కొత్తగా గృహ రుణం తీసుకున్న వారు ఈ కింది వివరించిన మూడు అంశాలను దృష్టిలో ఉంచుకుంటే ఈఎంఐను తగ్గించుకోవచ్చు.
1. తక్కువ ఎల్‌టీవీ..
ఆస్తి విలువలో బ్యాంకులు లేదా ఇతర రుణ సంస్థల నుంచి పొందే రుణం శాతమే ఎల్‌టీవీ రేషియో. మిగిలిన మొత్తాన్ని రుణ గ్రహీత సొంతంగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా గృహ మొత్తం విలువలో 80- 85 శాతం వరకు రుణం ఇస్తుంటాయి. మరికొన్ని సంస్థలయితే 90 శాతం వరకు కూడా రుణం ఆఫర్ చేస్తాయి. అయితే ఇంటి మొత్తం విలువలో ఎల్‌టీవీ రేషియోని తగ్గించుకుంటే .. తక్కువ వడ్డీకే రుణం ఇచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా ఈఎంఐ కూడా తగ్గుతుంది. అంటే బ్యాంకులు ఎంత పరిమితి వరకు రుణం ఇస్తాయో.. అంత మొత్తం తీసుకోకుండా, సాధ్యమైనంత వరకు సొంతంగా సమకూర్చుకునేందుకు ప్రయత్నించాలి. మరోవిధంగా చెప్పాలంటే కనీస డౌన్‌పేమెంట్ చెల్లించి.. మిగిలిన మొత్తం రుణం తీసుకోకుండా.. డౌన్‌పేమెంట్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి.
"ఎల్‌టీవీ రేషియో తగ్గితే, రుణ దాతలకు క్రెడిట్ రిస్క్ తగ్గుతుంది. ఈ కారణంగానే తక్కువ వడ్డీ రేటుకే గృహ రుణాలను ఇచ్చేందుకు ముందుకొస్తాయి. ఇది వడ్డీతో పాటు, అప్పు తీసుకునే వారి ఈఎంఐ భారాన్ని తగ్గిస్తుంది." అని పైసాబజార్.కామ్ గృహ రుణాల హెడ్ రతన్ చౌదరి తెలిపారు.
2. ఎక్కువ కాలపరిమితి..
కొత్తగా గృహ రుణం తీసుకునే వారు ఎక్కువ కాలపరిమితిని ఎంచుకోవడం ద్వారా ఈఎంఐ భారాన్ని తగ్గించుకోవచ్చు. ఎక్కువ కాలపరిమితితో ఈఎంఐ తగ్గుతుంది కానీ వడ్డీ రూపంలో ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తుంది. తక్కువ కాలపరిమితిని ఎంచుకుంటే ఈఎంఐ ఎక్కువైనా వడ్డీ మొత్తం తగ్గుతుంది. ఎక్కువ కాలపరిమితి ఎంచుకునే వారి గృహ రుణ దరఖాస్తు ఆమోదం పొందే అవకాశాలు ఎక్కువ. కారణం.. కాలపరిమితి ఎక్కువగా ఉంటే ఈఎంఐ తక్కువ ఉంటుంది. దీంతో అప్పు తీసుకున్న వ్యక్తి సులభంగా ఈఎంఐలు చెల్లించగలుగుతారు. రుణం ఎగొట్టే ప్రమాదం తక్కువగా ఉంటుంది.
3. ఆన్‌లైన్లో రేట్లను పోల్చండి..
గృహరుణం కోసం ఏదైనా బ్యాంకును, రుణ సంస్థను ఎంచుకునే ముందు ఆన్‌లైన్‌లో వివిధ సంస్థలు ఆఫర్ చేస్తున్న గృహ రుణాల వడ్డీ రేట్లను పోల్చి చూడాలి. సరైన రుణం పొందేందుకు ప్రస్తుతం అనేక వెబ్‌సైట్‌లు సహాయపడుతున్నాయి. ఈ ఆన్‌లైన్ పోర్టల్స్.. వివిధ సంస్థలు అందించే రుణాలు, వాటికి సంబంధించిన వడ్డీ రేట్లు, ఫీజులు, ఇతర ఛార్జీలు గురించి సవివరంగా తెలియజేస్తున్నాయి. మెరుగైన గృహ రుణం పొందేందుకు సరైన రీతిలో అన్నింటిని పరిశీలించి సరైన గృహ రుణం ఎంచుకోవడం ముఖ్యం.
ఇవీ చదవండి: