కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ(డియర్నెస్ అలవెన్స్), పెన్షనర్లకు డీఆర్ (డియర్నెస్ రిలీఫ్) 17 నుంచి 28 శాతానికి పెంచుతూ కేబినెట్ ఇటీవల నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ పెంపును అమలు చేయాలని ఆర్థిక శాఖ కూడా.. సంబంధిత విభాగాలను ఆదేశించింది. కేబినెట్ నిర్ణయం ప్రకారం.. జులై 1 నుంచే ఈ పెంపును అమలు చేయాలని సూచించింది.
'దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం రికార్డు స్థాయి అయిన.. 6 శాతం వద్ద ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల లక్షలాది మంది ఉద్యోగులకు ఊరట లభించనుంది. ముఖ్యంగా పెరిగిన ఆహార పదార్థాలు, వంట నూనెల ధరల నుంచి ఈ నిర్ణయంతో కాస్త ఉపశమనం లభించొచ్చు' అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఆర్థిక శాఖ ఆదేశాలతో... 48 లక్షలకుపైగా ఉద్యోగులకు.. 65 లక్షలకుపైగా పెన్షనర్లకు లబ్ది చేకూరనుంది. ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాపై వార్షికంగా రూ.34,401 కోట్లు అదనపు భారం పడనుంది.
మరిన్ని ముఖ్యమైన విషయాలు..
- ఏడాదిన్నర కాలంగా.. కరోనా వైరస్ సృష్టిస్తున్న కల్లోల పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగులకు కాస్త ఊరటనిచ్చేందుకు గానూ.. డీఏను 17 శాతం నుంచి 28 శాతానికి (11 శాతం) పెంచింది కేంద్రం.
- 2019 జులై నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 17 శాతం డీఏనే పొందుతుండటం గమనార్హం.
- నిజానికి 2020 జనవరి 1 నుంచే డీఏ పెంపు వర్తిస్తుందని ఉద్యోగులు ఆశించినప్పటికి.. కరోనా పరిస్థితుల నేపథ్యంలో అది సాధ్యం కాలేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
- జులై 1 నుంచి పెరిగిన డీఏతో.. రూ.18,000 నెలవారీ వేతనం అందుకునే ఉద్యోగులు ఇక నుంచి 11 శాతం (రూ.5,040) అదనంగా పొందనున్నారు.
- డీఏ పెంపుతో.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు నికర వేతనంతో పాటు.. ప్రావిడెంట్ ఫండ్, ట్రావెల్ అలవెన్స్ (టీఏ), గ్రాట్యుటీ కూడా పెరగనుంది.
ఇదీ చదవండి:ఆ సంస్థలో చేరితే.. 'వర్క్ ఫ్రం దుబాయ్- బీఎండబ్ల్యూ బైక్'