కరోనా సంక్షోభంతో తీవ్రంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ త్వరలో మరో ఉద్దీపనన ప్యాకేజీని ప్రకటించనున్నట్లు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తరుణ్ బజాజ్ మంగళవారం వెల్లడించారు. మీడియాతో వర్చువల్‌గా మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని తెలిపారు.
ప్యాకేజీ కోసం ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాల నుంచి వచ్చిన సలహాలు, సూచనలను ఆర్థిక శాఖ ప్రస్తుతం పరిశీలిస్తోందిని బజాజ్ వివరించారు. ప్యాకేజీకి సంబంధించి తేదీని చెప్పడం ఇప్పుడు కష్టమైనపనని.. అయితే ప్రస్తుతం ఈ విషయంపై చర్చలు జరుగుతున్నట్లు స్పష్టం చేశారు.
కరోనా నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు ఊతమందించే దిశగా ఇప్పటికే పలు చర్చలు చేపట్టింది కేంద్రం. మార్చిలో రూ.1.70 లక్షల కోట్లతో ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (పీఎంజీకేపీ)ని ప్రకటించింది. ఆ తర్వాత మేలో రూ.20.97 లక్షల కోట్లతో సరఫరాపై దృష్టి సారిస్తూ.. ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీని ప్రకటించింది. దీనితో పాటు గత నెల డిమాండ్‌ను పెంచేందుకు పలు చర్యలను ప్రకటించింది.
ఆహార పదార్థాల ధరల పెరుగుదల తాత్కాలికమేనన్నారు బజాజ్. ఇప్పటికే ప్రభుత్వం ధరల నియంత్రణకు పలు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. అన్‌లాక్ తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ నెమ్మెదిగా వృద్ధి దిశగా కదులుతున్నట్లు తరుణ్ బజాజ్ తెలిపారు. రానున్న నెలల్లో వృద్ధి ఇంకా మెరుగవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:అక్టోబర్‌లో 5.4 శాతం క్షీణించిన భారత ఎగుతులు