ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్).. రిటైర్మెంట్కు సంబంధించిన పెట్టుబడి పథకం. ప్రభుత్వం గుర్తించిన ఉత్తమ పెట్టుబడి సాధనాల్లో ఇది కూడా ఒకటి. దీని ద్వారా రిటైర్మెంట్ సమయంలో కార్ఫస్ మొత్తాన్ని ఒకేసారి పొందొచ్చు.
పన్ను ప్రయోజనాలు..
ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఇందులో పెట్టుబడుల ద్వారా పన్ను ప్రయోజనాలు కూడా పొందవచ్చు. అసలుతో పాటు వడ్డీకి కూడా పన్ను ప్రయోజనాలు వర్తిస్తాయి. మెచ్యూరిటీ సమయంలో వచ్చే అసలు, వడ్డీకి ఎలాంటి పన్ను వర్తించదు కాబట్టి చిన్న మొత్తాల పొదుపునకు ఇది సరైన పథకం.
అయితే ఇది కేవలం పెట్టుబడికి సంబంధించి మాత్రమే కాకుండా అత్యవసర సమయాల్లో కావాల్సిన నిధులు పొందేందుకు కూడా ఉపయోగపడుతుంది. పీపీఎఫ్ మీద రుణం తీసుకోవటం ద్వారా ఆర్థిక అత్యవసరాలను తీర్చుకోవచ్చు.
రుణం ఎప్పుడు తీసుకోవచ్చు?
పీపీఎఫ్ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరూ రుణం తీసుకోవచ్చు. ఖాతా తెరిచిన తర్వాత 3 నుంచి 6 సంవత్సరాల వరకు రుణం తీసుకోవచ్చు. ఉదాహరణకు 2020-21లో ఖాతా తెరిచినట్లయితే 2022-23 నుంచి 2025-26 వరకు రుణం తీసుకోవచ్చు. ఏడో ఆర్థిక సంవత్సరం నుంచి ఖాతా నుంచి కొంత మొత్తం ఉపసంహరించుకునే వీలు ఉంటుంది కాబట్టి రుణం తీసుకోవాలన్న అంశం తలెత్తదు.
రుణ దరఖాస్తు చేసిన ఆర్థిక సంవత్సరం కంటే ముందు ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో పీపీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తంలో 25 శాతం వరకు రుణం తీసుకోవచ్చు. అంటే 2022-23లో రుణం తీసుకోవాలనుకుంటే 2021 మార్చి వరకు ఉన్న మొత్తంలో 25 శాతం రుణం తీసుకోవచ్చు.
ఏడాదికి ఒక సారి మాత్రమే…
ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక్క రుణం మాత్రమే తీసుకోవచ్చు. మొదటి రుణం పూర్తిగా చెల్లించేంత వరకు రెండో రుణం తీసుకోరాదు. పీపీఎఫ్ రుణంపై వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. 36 నెలల వ్యవధి రుణానికైతే.. పీపీఎఫ్ ఖాతా మీద వస్తోన్న వడ్డీ కంటే ఒక శాతం ఎక్కువ వడ్డీతో ఈ రుణం పొందవచ్చు. 36 నెలల కంటే పైబడిన రుణానికైతే వడ్డీ కంటే 6 శాతం ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
తక్కువ వడ్డీ రేట్లు..
ఈ రుణం స్వల్ప కాలంలో తలెత్తే అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఉపయోగించుకోవచ్చని వ్యక్తిగత ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ప్రయోజనాలు.. ఈ రుణం విషయంలో ఎలాంటి తనఖా ఉంచాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా బ్యాంకులు అందించే సంప్రదాయ వ్యక్తిగత రుణాల కంటే వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. అసలు మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు పలు అప్షన్లు ఉంటాయి. అసలు మొత్తాన్ని ఒకే సారి చెల్లించవచ్చు. లేదా వాయిదా పద్ధతిలో చెల్లించుకోవచ్చు.
ఇవీ చదవండి: