అమెరికా ఆర్థిక వ్యవస్థ ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో 33 శాతం వార్షిక రేటుతో క్షీణించింది. ఒక త్రైమాసికంలో ఇంత గణనీయంగా ఆర్థిక వ్యవస్థ క్షీణించడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి. అమెరికా వృద్ధిలో కీలకమైన వినియోగదారు వినియోగం బాగా పడిపోవడం ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపింది. పర్యాటకం, ప్రయాణాలు నిలిపివేత, రెస్టారెంట్లు, బార్లు, వినోద వేదికల మూసివేతతో వినియోగదారు వినియోగంలో 34 శాతం క్షీణత నమోదైంది.
నిరుద్యోగిత రేటు 14.7 శాతం
కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావం, ఆ తర్వాత వ్యాపారాల షట్‌డౌన్ కారణంగా ఉద్యోగాల కోల్పోయిన వాళ్ల సంఖ్య లక్షల్లోనే ఉంది. నిరుద్యోగిత రేటు 14.7 శాతానికి పెరగడమే ఇందుకు నిదర్శనం. 18 వారాల పాటు నిరుద్యోగ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న వాళ్లు దేశంలో ఎక్కువ మందే ఉన్నారు. వ్యాపార పెట్టుబడులు, స్థిరాస్తి రంగం కూడా ఏప్రిల్- జూన్‌లో బాగా డీలాపడింది.
మెక్సికో 17 %
ప్రస్తుత సంవత్సరం రెండో త్రైమాసికంలో మెక్సికో ఆర్థిక వ్యవస్థ వృద్ధి 17.3 శాతం క్షీణించింది. కొవిడ్-19 పరిణామాలతో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడం, దేశం తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకోవడం ఇందుకు దారితీసింది. సంఘటిత రంగంలో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు పోయాయి. అసంఘటిత రంగంలో ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండొచ్చని అక్కడి అధికారిక వర్గాల అంచనా. ఏప్రిల్‌లో ఆర్థిక వ్యవస్థ సంక్షోభ అంచులకు వెళ్లిందని మెక్సికో అధ్యక్షుడు మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడర్ ప్రకటించడం గమనార్హం. పారిశ్రామిక ప్రగతి 25 శాతం మేర పడిపోయింది. 1993లో నెలవారీ గణాంకాలు లెక్కించడం ప్రారంభించినప్పటి నుంచి ఒక నెలలో అత్యధిక క్షీణత ఇదే. 2020లో మెక్సికో ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు -9 శాతంగా నమోదుకావచ్చని కూడా అంచనా వేస్తున్నారు.
జర్మనీ 10 %
జర్మనీ ఆర్థిక వ్యవస్థపైనా కరోనా మహమ్మారి తీవ్రంగానే ప్రభావం చూపింది. ఏప్రిల్- జూన్‌లో ఈ దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి 10.1 శాతం మేర క్షీణించిందని అక్కడి అధికారిక గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. 1970లో వృద్ధి గణాంకాలు లెక్కించడం ప్రారంభించిన నాటి నుంచి ఒక త్రైమాసికంలో వృద్ధి ఇంత గణనీయగా పడిపోవడం ఇదే మొదటిసారి. 2009లో ప్రపంచం ఆర్థిక సంక్షభంలో చిక్కుకున్నప్పుడు కూడా జర్మనీ వృద్ధి ఇంతలా క్షీణించలేదు. కరోనా వైరస్ నియంత్రణ నిమిత్తం కఠిన లాక్‌డౌన్ ఆంక్షలు విధించడంతో దేశవ్యాప్తంగా అన్ని వ్యాపారాల కార్యకలాపాలు ఎక్కడివక్కడ నిలిచిపోవడం ఇందుకు కారణమయ్యాయి. 2022 వరకు కూడా జర్మనీ ఆర్థిక వ్యవస్థ కరోనా వ్యాప్తి ముందున్న స్థాయిని అందుకోకపోవచ్చని అక్కడి విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి: 'చైనా దుర్బుద్ధిని తీవ్రంగా పరిగణించాలి'