''పొదుపు అనేది చాలా మంచి విషయం. మరీ ముఖ్యంగా మీ తల్లిదండ్రులు మీ కోసం పొదుపుచేస్తే..''
- విన్స్టన్ చర్చిల్
నిజమే పై మాటల్లో ఎలాంటి సందేహం లేదు. మరి మీరు మీ పిల్లల కోసం పెట్టుబడి పెట్టడం.. వారిని ఆర్థిక క్రమశిక్షణతో మెలిగేలా చేసేందుకు ఉన్న మార్గాల వంటి వివరాలు తెలుసుకోండి.
పిగ్గీ బ్యాంక్..

తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇవ్వాల్సిన బహుమతుల్లో పిగ్గీ బ్యాంక్ ఉత్తమమైందని చెప్పొచ్చు. ఇంతకు ముందులాగా ఇది అంత ప్రాచుర్యం పొందకపోయినప్పటికీ పిగ్గీ బ్యాంక్ (సేవింగ్స్ జార్)లో డబ్బు దాయడం ఓ సరదాతో కూడుకున్న పొదుపు ప్రణాళికగా చెప్పొచ్చు.
పిగ్గీ బ్యాంక్ మీ పిల్లకు ఇచ్చేముందు అందులో కొంత డబ్బును ఉంచండి. మీ పిల్లలను అందులో డబ్బు దాస్తూ ఉండమని చెప్పండి. ఈ అలవాటు కచ్చితంగా మీ పిల్లలకు డబ్బువిలువ తెలిసేలా చేస్తుంది. మరీ ముఖ్యంగా పొదుపు చేసేందుకు ఇది తొలి మెట్టు అవుతుంది.
చదువు, పెళ్లి కోసం సిప్..

ఇప్పటికే మీ పిల్లల కోసం వారి పేరుపై బ్యాంక్ ఖాతా తెరిచి ఉంటే.. దాని ద్వారా లావాదేవీలు జరుపుతూ ఉండండి. ఖాతాలో సిప్ (సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) ప్రారంభించండి. మీ పిల్లల వయస్సుకు అనుగుణంగా ఉన్నత చదువులు, పెళ్లిళ్ల కోసం నెల, మూడు నెలలు, వార్షిక ప్రణాళికతో బ్యాంకులో పొదుపు చేయండి. బ్యాంకు ఖాతా వినియోగం గురించి మీ పిల్లలకు నేర్పించండి.
మ్యూచువల్ ఫండ్లు..

ఒక వేళ మీరు మీ పిల్లల కోసం దీర్ఘకాలిక పొదుపు బహుమతి ఇవ్వాలనుకుంటే.. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టండి. ఏఏఏ రేటింగ్ ఉన్న సెక్యూరిటీ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం మంచిది. ముఖ్యంగా ఈ ఫండ్, మెచ్యూరిటీ వంటి వివరాలను మీ పిల్లలకు వివరించండి.
బహుమతిగా స్టాక్‌లు..

మీ పిల్లలకు ఏదైన ప్రముఖ కంపెనీ స్టాక్ బహుమతిగా ఇవ్వండి. స్టాక్ ఎలా పని చేస్తుంది.. వాటి ఉపయోగాలు ఏంటనే విషయాలు వాళ్లకి అర్థమయ్యేలా చెప్పండి. వారికి తెలిసిన కంపెనీ స్టాక్‌లు అయితే మరీ మంచిది. ముఖ్యంగా బొమ్మల కంపెనీ, స్మార్ట్‌ఫోన్ కంపెనీల వంటివి. మీ పిల్లలు మైనర్లు అయితే వారు స్టాక్‌లు కొనలేరు.. కానీ వారి పేరుపై సంరక్షకుడిగా మీరు ఖాతాను తెరిచి మీ అధీనంలో కొనుగోళ్లు జరిపే వీలుంది.
గోల్డ్ ఈటీఎఫ్..

బంగారు బహుమతులు నచ్చని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. మీ పిల్లల కోసం మీరు బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకుంటే.. నగల రూపంలో కాకుండా ఈటీఎఫ్‌ల రూపంలో పెట్టుబడి పెట్టండి. దీని ద్వారా మీ పిల్లలకు భవిష్యత్‌లో ఉత్తమ రిటర్నులు వస్తాయనడంలో ఎలాంటి సందేహంలేదు.
ఇదీ చూడండి:ఈ దశాబ్దిలో... ఈ-విపణిలో ఇరుక్కుపోతాం!