ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఐపీఓ జులై 14న ప్రారంభమై.. 16న ముగియనుంది. ఐపీఓ ద్వారా జారీ చేసే ఒక్కో షేరు ధరను రూ.72-76 మధ్య నిర్ణయించింది జొమాటో.
మొత్తం రూ.9,375 కోట్ల నిధులు సమీకరించే లక్ష్యంతో జొమాటో ఐపీఓకు రానుంది. ఇందులో రూ.9000 కోట్లు విలువైన షేర్లను తాజాగా ఇష్యూ చేస్తుండగా.. రూ.375 కోట్లు విలువైన షేర్లను ఇన్ఫో ఎడ్జ్ (ఇండియా)లిమిటెడ్ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయిస్తోంది.
ఐపీఓకు సంబంధించి జొమాటో ఏప్రిల్లో సెబీకి దరఖాస్తు చేసుకుంది. జులై 2న దీనికి ఆమోదం లభించింది.
జొమాటో మరిన్ని వివరాలు..
2008లో భారత్లో ప్రారంభమైన జొమాటో.. యూఏఈ, శ్రీలంక, బ్రిటన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా సహా పలు ఇతర దేశాల్లోనూ సేవలందిస్తోంది. ఈ సంస్థలో ఇన్ఫోఎడ్జ్, ఉబర్, అలీపే, యాంట్ ఫిన్ సంస్థలు వాటాదారులుగా ఉన్నాయి.
2018 ఆర్థిక సంవత్సరంలో 3.06 కోట్ల ఆర్డర్లను డెలివరీ చేసింది జొమాటో. 2020 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 40.31 కోట్లకు పెరిగింది. 2021లో ఇప్పటికే 15.52 కోట్ల ఆర్డర్లు వచ్చినట్లు సమాచారం.
సగటు ఆర్డర్ విలువ 2020 ఆర్థిక సంవత్సరంలో రూ. 279గా ఉండగా.. 2021లో అది రూ. 398 వరకు పెరిగింది. 2020 డిసెంబర్ 31 నాటికి, జొమాటో జాబితాలో 3,50,174 యాక్టివ్ రెస్టారెంట్‌లు ఉన్నాయి.