రిలయన్స్ ఇండస్ట్రీస్.. భారతదేశ పారిశ్రామిక రంగంలో పరిచయం అక్కర్లేని పేరు. ఆయిల్ మార్కెట్‌ను శాసించిన ఈ కంపెనీ నవ ఆయిల్గా పరిగణిస్తోన్న డేటా మార్కెట్లో ఇప్పటికే కీలక స్థానాన్ని సంపాదించుకుంది. జియోతో దేశంలో డేటా విప్లవం తీసుకొచ్చింది.
కరోనా ప్రభావంతో ప్రపంచమంతా సంక్షోభంలోకి జారుకుని.. దిగ్గజ సంస్థలూ కుదేలయ్యాయి. చాలా కంపెనీలకు ఉద్యోగుల వేతనాలు చెల్లించడమే కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ జియో భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తోంది. మరోవైపు.. రిలయన్స్ రైట్స్ ఇష్యూ ద్వారా భారీగా నిధులు సమీకరించుకుంది.
ఈ స్థాయిలో నిధులు సమీకరించుకోవడంలో రిలయన్స్ వ్యూహమంతా ఒక్కటే! అదే.. సంస్థను రుణరహితంగా మార్చడం.
రిలయన్స్‌లోకి పెట్టుబడుల ప్రవాహం ఆ సంస్థకు మాత్రమే కాకుండా.. దేశ ఆర్థిక వ్యవస్థకూ రానున్న రోజులు ఆశాజనకంగా ఉన్నాయనే సంకేతాలు ఇస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
జియో జిగేల్..
దేశంలో 4జీ స్థితిగతులను పూర్తిగా మార్చేసిన జియో.. భారత టెలికాం రంగంలో ఒక సంచలనం. ప్రపంచంలో డేటా అధికంగా వినియోగిస్తున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది అంటే అందుకు కారణం జియో అనే చెప్పాలి. జియోను ఈ స్థాయికి తీసుకురావడానికి రిలయన్స్ భారీగా పెట్టుబడులు పెట్టాల్సి వచ్చింది. ఇందుకోసం అప్పులు కూడా భారీగానే చేయాల్సి వచ్చింది. వాటిని తీర్చి.. రుణ రహితంగా మారడమే ప్రధాన లక్ష్యంగా ఇటీవల నిధుల సమీకరణను ముమ్మరం చేసింది రిలయన్స్.
అప్పులు.. లక్ష్యాలు
- 2020 మార్చి 31 నాటికి ఈ సంస్థ అప్పులు రూ. 1.6 లక్షల కోట్లుగా ఉన్నాయి.
- 2021 మార్చి 31 నాటికి రుణరహితంగా మారాలన్నది రిలయన్స్ లక్ష్యం.
- సౌదీ ఆరాంకోతో రూ.1.4 లక్షల కోట్ల ఒప్పందం... ఈ ఏడాది మార్చి 31 నాటికి పూర్తికావాలని లక్ష్యం... ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఆరాంకో డీల్ ఆలస్యం.
- రిఫైనరీ, పెట్రో కెమికల్ వ్యాపారాల్లో 20 శాతం వాటా విక్రయం ద్వారా ఆరాంకో నుంచి నిధులు సమకూర్చుకోవాలని ప్రణాళిక.
- బ్రిటన్‌కు చెంది బ్రిటీష్ పెట్రోలియం (బీపీ)తో జాయింట్ వెంచర్ ఏర్పాటు. 49 శాతం రిటైల్ వాటా రూ.7 వేల కోట్లకు విక్రయం.
ప్లాన్-బి
అయితే రిలయన్స్ అప్పులు తీర్చేందుకు కీలకమైన ఆరాంకో ఒప్పందం ఆలస్యమైన కారణంగా రిలయన్స్ 'ప్లాన్-బి'ని అమలు చేసింది. విదేశీ సంస్థల నుంచి టెలికాం విభాగం ద్వారా నిధులు సమీకరించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ఇటీవల జియోలోకి వరుస పెట్టుబడులను రాబట్టగలిగింది.
విదేశీ సంస్థల పెట్టుబడులు..
రుణ రహితంగా మారేందుకు అవకాశాలున్నాయా?
ఆరాంకో ఒప్పందం ఆలస్యమైనా సంస్థను రుణ రహితంగా మార్చేందుకు ప్లాన్-బి విజయవంతమవుతున్నట్లు బ్రోకరేజీ సంస్థ ఎడిల్వైస్ అంచనా వేసింది. ఆరాంకో డీల్ ఇప్పట్లో లేనప్పటికీ.. రిఫైనరీ వ్యాపారాల్లో 49 శాతం రిటైలింగ్ వాటాను రూ.7వేల కోట్లకు బ్రిటన్‌కు చెంది బ్రిటీష్ పెట్రోలియంకు విక్రయిస్తున్నట్లు ముకేశ్ అంబానీ గతంలో ప్రకటించారు. వీటికి తోడు జియోకు వచ్చిన పెట్టబడి.. నిధులతో రిలయన్స్ రుణరహితంగా మారేందుకు అవకాశాలు ఉన్నాయని తెలిపింది ఎడిల్వైస్.
జియోకు వచ్చిన నిధులు..
జియో ప్లాట్ ఫామ్స్‌లో దాదాపు 20 శాతం వాటా విక్రయం, ఇంధన వ్యాపారాల్లో బీపీకి వాటా బదిలీ, రైట్స్ ఇష్యూ ద్వారా రిలయన్స్‌కు మొత్తం రూ.1.3 లక్షల కోట్ల సమకూరుతుందని అంచనా. దీనితో అప్పులు లేని సంస్థగా అవతరించేందుకు అవసరమైన నిధులు దాదాపుగా సమకూరినట్లేనని అభిప్రాయపడింది ఎడిల్వైస్.
తగ్గుతున్న మూలధన వ్యయాలు..
రిఫైనరీ, టెలికాం వ్యాపారాలకు సంబంధించి ప్రధాన ప్రాజెక్టులు పూర్తి కావస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2019-20లో రూ.లక్ష కోట్లుగా ఉన్న మూలధన పెట్టుబడులు.. 2020-21లో రూ.76వేల కోట్లకు తగ్గనున్నాయి. తరువాత సంవత్సరం మరింతగా తగ్గి రూ.46వేల కోట్లకు చేరుతాయని ఎడిల్వైస్ అంచనా వేస్తోంది.