ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా ఈనెల 22న దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించాలని బ్యాంకు ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ), బ్యాంకు ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఈఎఫ్‌ఐ) సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి.
ఈ మేరకు వారు ఇండియన్ బ్యాంకు అసోసియేషన్ (ఐబీఏ)కు నోటీసులు అందజేశారు. విలీనం ద్వారా అనేక మంది ఉద్యోగాలు, పదోన్నతులు కోల్పోయే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
బ్యాంకింగ్ రంగ కష్టాలు తీర్చేందుకు ఎగవేతదారుల నుంచి రుణాలు వసూలు చేస్తే సరిపోతుందని.. దానికోసం విలీనం చేయాల్సిన పని లేదని బ్యాంకు సంఘాలు అంటున్నాయి. సంస్కరణల పేరిట సామాన్య వినియోగదారులపై అధిక సర్వీస్ ఛార్జీలు వేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించాయి. ఈ నోటీసులో మొత్తం 6 అంశాలను పేర్కొంటూ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి ఉద్యోగ సంఘాలు. గతనెల 26 నుంచి 27నే సమ్మె చేయాలని పిలుపునిచ్చినా.. చివరి నిమిషంలో సమ్మెను వాయిదా వేశాయి.
నోటీసుల్లో పేర్కొన్న డిమాండ్లు ఇవే..
- బ్యాంకుల విలీనం ఉపసంహరణ
- సత్వర వేతన సవరణ
- వారానికి ఐదురోజుల పనిదినాల అమలు
- విజిలెన్స్ కేసుల్లో బయటి సంస్థల జోక్యాన్ని నిలిపివేయడం
- ఎన్పీఎస్ స్థానంలో పాత పెన్షన్ విధానం అమలు
- సేవా ఛార్జీలు తగ్గింపు
బ్యాంకుల విలీన ప్రతిపాదన ఇలా..
ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొనేందుకు బ్యాంకుల విలీనం ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది కేంద్రం.
ఇందులో భాగంగా పంజాబ్ నేషనల్ బ్యాంకులో.. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలను కలపి రెండో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకుగా మార్చాలని నిర్ణయించింది.
కెనరా బ్యాంకులో.. సిండికేట్ బ్యాంక్‌ను విలీనం చేయాలని ప్రతిపాదించింది. ఇదే జరిగితే కెనరా బ్యాంకు 4వ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా అవతరిస్తుంది.
యూనియన్ బ్యాంకులో.. ఆంధ్రా బ్యాంకు, కార్బొరేషన్ బ్యాంకులను విలీనం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విలీనం పూర్తయితే యూనియన్ బ్యాంక్ 5వ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా తయారవుతుంది.
ఇక ఇండియన్ బ్యాంకులో.. అలహాబాద్ బ్యాంకును విలీనం చేయాలని ప్రభుత్వ ప్రతిపాదన. ఈ విలీనం పూర్తయితే దేశంలో 7వ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఇండియన్ బ్యాంకు అవతరిస్తుంది.
ప్రభుత్వం ప్రతిపాదించినట్లుగానే బ్యాంకుల విలీనం పూర్తయితే దేశంలో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే ఉండనున్నాయి.
ఇదీ చూడండి: 'ఎయిర్ఇండియా ప్రైవేటీకరణకు కసరత్తు ముమ్మరం'