అమెరికా-చైనా మధ్య వాణిజ్య చర్చలు సఫలం కావడంపై అనుమానాల నడుమ.. దేశీయ మార్కెట్లు ఒడుదొడుకులకు గురవుతున్నాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ ప్రస్తుతం 91 పాయింట్లు పుంజుకుని 37,650. వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 13 పాయింట్ల స్వల్ప లాభంతో 11,314 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.
ఇవీ కారణాలు
అమెరికా-చైనా మధ్య 11 దఫా వాణిజ్య చర్చలపై అంచనాలతో మదుపరులు అప్రమత్తత పాటిస్తున్నారు.
కొన్ని నెలల క్రితం చైనాతో వాణిజ్య చర్చలు జరిపేందుకు ప్రయత్నించగా అవి సఫలం కాలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇప్పుడు చైనా తిరిగి వాణిజ్య చర్చలకు వచ్చిందని ఈసారి అలా జరగనివ్వనని ట్రంప్ ఒక ప్రకటనలో తెపిపారు.
సుంకాల పెంపునకు ప్రతి చర్య ఉంటుందని చైనా హెచ్చరించింది. రెండు దేశాలు ఇలాంటి ప్రకటనలు చేయడం మదుపర్లను కలవరపెడుతోంది.
లాభానష్టాల్లోనివే
యస్ బ్యాంకు, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, వేదాంత, ఎస్బీఐ, టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
హెచ్‌సీఎల్ టెక్, ఏషియన్ పెయింట్స్, కోల్ ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంకు, హెచ్‌యూఎల్, పవర్ గ్రిడ్ షేర్లు నష్టాలతో ట్రేడవుతున్నాయి.
ఇతర మార్కెట్లు ఇలా..
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లు షాంఘై సూచీ, జపాన్ సూచీ, హంకాంగ్ సూచీ, దక్షిణ కొరియా సూచీలు సానుకూలంగా ట్రేడింగ్ ప్రారంభించాయి.
రూపాయి
రూపాయి నేటి ట్రేడింగ్ ప్రారంభంలో 7 పైసలు బలహీన పడింది. ప్రస్తుతం డాలర్‌తో రూపాయి మారకం విలువ 70కి పైగా ట్రేడవుతోంది.
ముడిచమురు
ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 0.33 శాతం తగ్గింది. బ్యారెల్ ముడి చమురు ధర 70.62 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.