వారమంతా ఒడుదొడుకుల నడుమ సాగిన స్టాక్ మార్కెట్లు వారం చివరి రోజు భారీగా లాభపడ్డాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 336.47 పాయింట్ల లాభపడి తిరిగి 39 వేల మార్కును దాటిది. మార్కెట్లు ముగిసే సమయానికి 39,067.33 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 112.85 పాయింట్లు పుంజుకుని 11,754.65 వద్ద సెషన్ ముగించింది.
ఆర్థిక, లోహ సాంకేతిక రంగాలు నేడు లాభపడ్డాయి. ఆటోమొబైల్ రంగం అత్యధికంగా నష్టాలు మూటగట్టుకుంది.
వారం మొత్తం మీద చూస్తే సెన్సెక్స్ దాదాపు 154 పాయింట్లు నష్టపోయింది.
ఇంట్రాడే సాగిందిలా
సూచీ | గరిష్ఠం | కనిష్ఠం |
సెన్సెక్స్ | 39,103.16 | 38,765.33 |
నిఫ్టీ | 11,762.90 | 11,661.75 |
ఇదీ కారణం
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల తగ్గుదల, విదేశీ పెట్టుబడుల ప్రవాహం నేటి లాభాలకు ప్రధాన కారణం.
లాభానష్టాల్లోనివివే
వార్షిక ఫలితాలు అందించిన ఊతంతో టాటా స్టీల్ అత్యధికంగా 6.67 శాతం లాభపడింది. ఐసీఐసీఐ బ్యాంకు 3.05 శాతం, యాక్సిస్ బ్యాంకు 2.61 శాతం, టీసీఎస్ 2.13శాతం, ఎస్బీఐ 1.96 శాతం, రిలయన్స్ 1.23 శాతం పెరిగాయి.
టాటా మోటార్స్ అత్యధికంగా 2.84 శాతం నష్టపోయింది. బజాజ్ ఆటో 1.21 శాతం, మారుతి 1.03 శాతం, భారతీ ఎయిర్టెల్ 1.02 శాతం, ఎం అండ్ ఎం 0.94 శాతం, వేదాంత 0.70 శాతం నష్టాలు నమోదుచేశాయి.
30 షేర్ల ఇండెక్స్‌లో 18 షేర్లు లాభాలు నమోదు చేయగా... 12 షేర్లు నష్టాల్లో ముగిశాయి.
50 షేర్ల నిఫ్టీ ప్యాక్‌లో 33 షేర్లు లాభాల్లో ముగియగా 16 షేర్లు నష్టాలు నమోదు చేశాయి. ఏషియన్ పెయింట్స్ షేర్లలో పెద్దగా మార్పులేదు.
రూపాయి, ముడి చమురు
నేటి ట్రేడింగ్‌లో రూపాయి 25 పైసలు బలపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.70గా నమోదైంది.
ముడి చమురు ధరల చూచీ బ్రెంట్ ఈ ఒక్క రోజే 1.28 శాతం తగ్గింది. ఈ కారణంగా గత సెషన్‌తో పోలిస్తే బ్యారెల్ ముడిచమురు ధర 75 డాలర్ల నుంచి 73.41 డాలర్లకు దిగొచ్చింది.
ఇతర మార్కెట్లు సాగాయిలా
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లయిన షాంఘై సూచీ, జపాన్ సూచీ నిక్కీ, దక్షిణ కొరియా సూచీ- కోస్పీ నష్టాలతో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.