బ్యాంకు మోసాలు, మనీలాండరింగ్ కేసుల్లో గుజరాత్లోని వడోదరకు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ స్టెర్లింగ్ బయోటెక్పై ఈడీ పంజా విసిరింది. సంస్థకు చెందిన రూ.9,778 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. ఇందుకోసం ఎఫ్ఎంఎల్ఏ చట్టం కింద ఆదేశాలు ఇచ్చినట్లు ఈటీ వెల్లడించింది.
జప్తు చేసిన ఆస్తుల్లో నైజీరియాలో ఉన్న 'ఓఎంఎల్ 143' పేరుతో ఉన్న చమురు క్షేత్రం సహా 4 రిగ్గులు, పనామాలోని 4 నౌకలు, అమెరికాలో కొనుగోలు చేసిన ఓ విమానంతో పాటు మరికొన్ని ఆస్తులు ఉన్నాయి.
సంస్థ ప్రమోటర్లపై అభియోగాలు
సంస్థ ప్రచారకర్తలు నితిన్ సందేశరా, చేతన్ సందేశరా, దీప్తి సందేశరాలపై వివిధ బ్యాంకుల్లో రూ.8,100 కోట్ల రుణాల మోసానికి పాల్పడినట్లు ఆరోణలు ఉన్నాయి. ప్రస్తుతం వీరు పరారీలో ఉన్నారని ఈడీ వెల్లడించింది.
వీరికి బడా రాజకీయ నేతలతో సంబంధాలున్నాయని ఈడీ ఆరోపించింది. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొంది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలతో దేశీయంగా 249, విదేశాల్లో 96 డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసినట్లు అభియోగాలు ఉన్నాయి.
ఇంతకు ముందే ఆస్తులు జప్తు చేసిన ఈడీ
ఇదే కేసులో ఈడీ ఇది వరకే రూ.4,730 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేసింది. స్టెర్లింగ్ గ్రూపు ప్రమోటర్లుగా రుణం తీసుకుని.. ఆ నిధులను నైజీరియాలోని చమురు వ్యాపారాలకు, వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారనేవి ప్రధాన అభియోగాలుగా ఈడీ పేర్కొంది.
ఎస్బీఎల్సీ లేఖ ద్వారా ఆర్బీఐ నిబంధనలను కాలరాస్తూ రూ.4,500 కోట్ల మోసానికి పాల్పడినట్లు తమ విచారణలో తేలిందని ఈడీ పేర్కొంది. మరో వైపు ఆంధ్రాబ్యాంకు కన్సార్షియం నేతృత్వంలో రూ. 5,383 కోట్లు రుణం తీసుకున్నట్లు ఈడీ పేర్కొంది. ఇప్పుడు ఈ రుణాల మొత్తం రూ. 8,100 కోట్ల నిరర్థక ఆస్తులుగా మారినట్లు ఆరోపణలు వచ్చాయని వెల్లడించింది.
పరారీలో ఉన్న నిందితులు విదేశాల్లో ఉన్నారని.. వారిని భారత్కు రప్పించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు ఈడీ తెలిపింది.
ఇదీ చూడండి: ఐక్యరాజ్యసమితిలో భారత్ మరో దౌత్య విజయం