దేశంలో అత్యంత విలువైన సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ తన 43వ వార్షిక వాటాదారుల సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనుంది. కరోనా విపత్తు నేపథ్యంలో బహిరంగ సమావేశాలకు అనుమతి లేనందున ఈ నిర్ణయం తీసుకుంది. 2020 జులై 15న ఈ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) ఉంటుందని స్పష్టం చేసింది.
కరోనా నేపథ్యంలో కంపెనీల వార్షిక సమావేశాలను వీడియో కాన్ఫరెన్స్‌లోనే నిర్వహించాలని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించింది. జూన్ 11న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) కూడా వార్షిక సాధారణ సమావేశాన్ని వీసీ ద్వారానే నిర్వహించింది.
భారీ స్థాయిలో..
రిలయన్స్ ఐపీఓ పెట్టిన తర్వాత జరిగిన అన్ని వార్షిక సమావేశాలు భారీ స్థాయిలో నిర్వహిస్తూ వచ్చింది. భారత్‌లో ఈక్విటీ సంస్కృతిని ప్రారంభించిన రిలయన్స్.. దాని వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ కాలంలో ఈ సమావేశాలను భారీ స్టేడియాల్లో ఏర్పాటు చేసేవారు.
ముంబయిలోని కూపరేజ్ ఫుట్‌బాల్ మైదానం వేదికగా 1985లో జరిగిన రిలయన్స్ ఏజీఎంలో 12 వేల మంది పాల్గొన్నారు. ఆ తర్వాత ఏడాది క్రాస్ మైదాన్ నిర్వహించిన సమావేశంలో ఈ సంఖ్య 35 వేలకు చేరింది. ఆ తర్వాతి కాలంలో ఏజీఎంలను ఆడిటోరియాల్లో నిర్వహించారు. వాటాదారుల సంఖ్య 24 లక్షలకు చేరినా ఇదే కొనసాగించారు.
ఏడాది ముందే..
గతేడాది ఆగస్టు 12న జరిగిన చివరి ఏజీఎం జరిగింది. ఈ సమావేశంలో 2021 మార్చి 31 కల్లా రుణరహిత కంపెనీగా అవతరించేందుకు ప్రణాళికలను వెల్లడించారు సంస్థ ఛైర్మన్ ముకేశ్ అంబానీ.
అయితే అనూహ్యంగా ఇప్పటికే ఆ లక్ష్యాన్ని ఛేదించింది రిలయన్స్. వాటాలు, హక్కుల అమ్మకాల ద్వారా రికార్డు స్థాయిలో రూ.1.69 లక్షల కోట్ల నిధులు సమకూర్చింది. వీటితో రిలయన్స్ సంస్థకు ఉన్న రూ.1.61 కోట్ల అప్పులను తీర్చేసింది.
ఇందులో ఫేస్బుక్ సహా అంతర్జాతీయ టెక్ సంస్థల పెట్టుబడుల ద్వారా రూ.1.15 లక్షల కోట్లు ఆర్జించింది. మిగిలిన రూ.53,124 కోట్లు ఇప్పటికే ఉన్న మదుపరులకు షేర్లు అమ్మటం ద్వారా సేకరించింది.
ఆరాంకో ఆలస్యమైనా..
చివరి ఏజీఎంలో సౌదీకి చెందిన దిగ్గజ సంస్థ ఆరాంకోతో 15 బిలియన్ డాలర్ల ఒప్పందం చేసుకుంది రిలయన్స్. అయితే కొన్ని కారణాల వల్ల ఆలస్యం జరిగింది. ఈ ప్రభావం సంస్థపై పడకుండా జియో ఫ్లాట్‌ఫామ్స్ ద్వారా పెట్టుబడిదారులను ఆకర్షించగలిగింది రిలయన్స్.
ఇదీ చూడండి: ప్రపంచ కుబేరుల టాప్ 10 జాబితాలో 'అంబానీ'