భారత టెలికాం రంగంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచింది రిలయన్స్ జియో. కంపెనీ ప్రారంభం నాటి నుంచి వార్తల్లో నిలుస్తూనే ఉంది. అప్పటివరకు దిగ్గజ సంస్థలుగా ఉన్న ఎయిర్టెల్, వొడాఫోన్-ఐడియా, బీఎస్ఎన్ఎల్.. జియో ప్రభావాన్ని తట్టుకోలేకపోయాయి. ఆ సంస్థల వినియోగదారుల సంఖ్యా భారీగా పడిపోయింది.
రిలయన్స్ జియో 2016 సెప్టెంబర్‌లో టెలికాం రంగంలోకి అడుగుపెట్టింది. అన్లిమిటెడ్ కాల్స్, డేటా ఆఫర్లు పరిచయం చేసి.. దేశంలో నెం.1 టెలికాం ఆపరేటర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది. ఇప్పుడు జియో బ్రాడ్‌బ్యాండ్, డీటీహెచ్ రంగాన్ని శాసించే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం ఎంచుకున్న మార్గం 'జియో గిగా ఫైబర్'.
జియో 'గిగా ఫైబర్'ను 2018 వార్షిక సర్వసభ్య సమావేశంలోనే ఆవిష్కరించినా.. ఇప్పటికీ పూర్తి వివరాలు ప్రకటించలేదు.
జియో గిగా ఫైబర్‌లో భాగంగా.. జియో గిగా టీవీ, హోమ్ సర్వీసెస్‌లను అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే బీటా దశలు పూర్తి చేసుకున్న తరుణంలో.. వీటి పూర్తి వివరాలు, సబ్స్క్రిప్షన్స్ ప్లాన్లు, ధరలు వంటి పూర్తి వివరాల్ని.. త్వరలో జరగనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సాధారణ సమావేశం-2019లో ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
రిలయన్స్ ప్రకటించిన ట్రిపుల్ ప్లే ప్లాన్.. ఇప్పటికే టెస్టింగ్ దశలో కొన్ని మెట్రో నగరాల్లో అందుబాటులో ఉంది. నెలకు రూ. 600 ఖర్చుతో 100 ఎంబీపీఎస్ వేగంతో 1000 జీబీ వరకు డేటా సదుపాయం లభిస్తోంది. జియో గిగా టీవీ, ల్యాండ్‌లైన్ సేవలు వీటికి అదనం.
రెండు సబ్స్క్రిప్షన్ ప్రణాళికలు..
జియో గిగా ఫైబర్‌నెట్‌ను రెండు వేర్వేరు ప్రణాళికల్లో తీసుకురానున్నట్లు ప్రకటించింది.
- రూ. 4500 తో సింగిల్ బ్యాండ్ రోటర్‌తో 100 ఎంబీపీఎస్ స్పీడ్ కనెక్షన్.
- రూ. 2500తో 50 ఎంబీపీఎస్ స్పీడ్ కనెక్షన్.
జియో గిగా ఫైబర్...
జియో గిగా ఫైబర్ అనేది... ఫైబర్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సొల్యూషన్. ఇది 1జీబీపీఎస్ వరకు ఉండే ఫిక్స్డ్ లైన్ ఇంటర్నెట్ సర్వీసు అందిస్తుంది. వైర్ ఆధారిత ఇంటర్నెట్ కంటే మెరుగైన సేవల్ని అందిస్తుంది. ఫిక్స్‌డ్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని అందించాలన్న ఉద్దేశంతో దీనిని తీసుకొస్తుంది రిలయన్స్.
జియో గిగాటీవీ అంటే..
జియో గిగా ఫైబర్ రిజిస్టర్ చేసుకున్నవారు.. జియో గిగా టీవీ సెట్ టాప్ బాక్స్‌నూ పొందుతారు. దీని ద్వారా 400కు పైగా చానళ్లు అందుబాటులోకి రానున్నాయి. జియో సినిమా, జియో మ్యూజిక్‌లలో ఉండే అన్ని పాటలూ, సినిమాలూ వస్తాయి.
హెచ్డీ వాయిస్, వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు. టీవీ నుంచి టీవీకి, టీవీ నుంచి స్మార్ట్‌ఫోన్‌కూ దీని ద్వారా కాల్స్ సదుపాయం ఉంటుంది. ఇందు కోసం జియో గిగా ఫైబర్‌తో కనెక్ట్ అయి ఉండాలి.
జియో హోం టీవీ సర్వీసుల ద్వారా.. వినియోగదారులకు ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ సేవల్ని అందిస్తుంది. అయితే.. కస్లమర్ల ఎంపిక మేరకు ఈ సౌలభ్యం లభిస్తుంది.
ఎదురుచూపులు..
ఇతర బ్రాడ్‌బ్యాండ్ ఆపరేటర్ల భారీ ధరలు తట్టుకోలేని ఎందరో వినియోగదారులు జియో గిగా ఫైబర్ నెట్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. జియో ఫైబర్‌నెట్ వస్తుందని ప్రకటించిన అనంతరం.. యాక్ట్ ఫైబర్‌నెట్, ఎయిర్టెల్ వి ఫైబర్ వంటి బ్రాడ్‌బ్యాండ్‌లు... ధరలు తగ్గించి జనాలను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఫైబర్నెట్తోనే అన్నీ...
జియో ఫైబర్‌నెట్ కనెక్షన్ ఉన్న ఇంట్లో 1 జీబీపీఎస్ హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్, అన్ని హెచ్డీ టీవీ ఛానళ్లు, వీడియో కాల్స్ వంటి సదుపాయాలు కల్పించడం ద్వారా దేశ ప్రజల రోజువారీ జీవనంపై గట్టి ప్రభావమే చూపబోతుంది రిలయన్స్.
ఇదీ చూడండి: