వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని 'పారిపోయిన ఆర్థిక నేరగాడి'గా ప్రకటించింది ముంబయిలోని ప్రత్యేక కోర్టు. పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల (ఎఫ్‌ఈవో) చట్టం గతేడాది ఆగస్టులో అమల్లోకి వచ్చాక ఈ ముద్రపడిన రెండో వ్యక్తిగా నీరవ్ మోదీ నిలిచారు. ఈ జాబితాలో మొదటి వ్యక్తి విజయ్ మాల్యా.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కుంభకోణంలో ప్రధాన నిందితులు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలను పరారీ ఆర్థిక నేరగాళ్లుగా ప్రకటించాలని ఈడీ గతంలో పిటిషన్ దాఖలు చేసింది. విచారించిన కోర్టు ఈ మేరకు సానుకూల నిర్ణయం తీసుకుంది.
పంజాబ్ నేషనల్ బ్యాంకును నకిలీ 'లెటర్ ఆఫ్ అండర్టేకింగ్' (ఎల్ఓయూ)ల ద్వారా దాదాపు రూ.14 వేల కోట్లకు మోసగించారు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ.
రూ.100 కోట్లు అంతకుమించి ఆర్థిక మోసాలకు పాల్పడి.. నేర విచారణను తప్పించుకునేందుకు దేశం విడిచి పారిపోయి, తిరిగి వచ్చేందుకు విముఖత చూపేవారిపై అరెస్టు వారెంట్ జారీ అయితే ఎఫ్‌ఈవో చట్టం కింద పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా ప్రకటించవచ్చు.