ప్రముఖ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ జూమ్ వచ్చే ఐదేళ్లలో భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు వేస్తోంది. ఇదే సమయంలో దేశీయంగా ఉద్యోగుల సంఖ్యను కుడా పెంచుకోనున్నట్లు తెలిపింది.
జూమ్‌కు పోటీగా ముకేశ్ అంబానీకి చెందిన జియో మీట్ ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే జూమ్ ఈ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
జూమ్‌కు చైనాతో సంబంధాలు?
జూమ్ యాప్‌కు చైనాకు సంబంధం ఉందంటూ వస్తున్న వార్తలను జూమ్ ప్రోడక్ట్ అండ్ ఇంజనీరింగ్ అధ్యక్షుడు వెల్చమి శంకర్లింగం తప్పుబట్టారు. జూమ్ యాప్ అమెరికా కంపెనీ అని.. అక్కడి స్థానిక స్టాక్ ఎక్స్చేంజి నాస్డాక్లో లిస్ట్ అయిందని గుర్తిచేశారు. చైనాలో తమకు కార్యాలయం ఉందని.. అమెరికా ప్రధాన కార్యాలయం ఆధినంలోనే అది కూడా పని చేస్తున్నట్లు బ్లాగ్‌లో వివరించారు.
ఇటీవల 59 చైనా యాప్‌లను భారత్ నిషేధించిన నేపథ్యంలో జూమ్ యాప్ కూడా చైనాదేనని.. దానిని నిషేధించాలనే డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో జూమ్ ఈ స్పష్టతనిచ్చింది.
డేటా సెంటర్లు..
జూమ్ భారతీయ కార్యకలాపాలకు ప్రస్తుతం ముంబయి, హైదరాబాద్‌లో డేటా సెంటర్లు ఉన్నట్లు శంకర్లింగం వెల్లడించారు.
జూమ్ సంస్థలో తనతో పాటు భారత సంతతికి చెందిన అపర్ణ బవ (చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్), సునీల్ మధన్ (కార్పొరేట్ చీఫ్ ఇన్ఫర్మెషన్ ఆఫీసర్) పని చేస్తున్నట్లు తెలిపారు శంకర్లింగం.
గోప్యత పరంగా జూమ్ యాప్‌పై వచ్చిన అనుమానాలను అర్థం చేసుకున్నన్నామన్నారు శంకర్లింగం. వీటిని దృష్టిలో ఉంచుకుని యూజర్లు వ్యక్తిగత గోప్యతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా 90 రోజుల్లో 100 ఫీచర్లు తీసుకొచ్చినట్లు వివరించారు.
జూమ్‌యాప్ వినియోగంతో వ్యక్తిగత గోప్యతకు ముప్పు ఉందని కేంద్ర హోం శాఖ ఏప్రిల్‌లో హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ప్రభుత్వంతో చర్చించినట్లు జూమ్ వెల్లడించింది.
కరోనాతో 'జూమ్'
కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో జూమ్‌కు ఆదరణ విపరీతంగా పెరిగింది. అయితే ఇటీవల జూమ్‌కు దేశీయంగా జియో మీట్ ద్వారా పోటీ ఎదురైంది. ఇటీవలే ఆవిష్కరించిన ఈ యాప్ కేవలం వారంలోనే 10 లక్షల డౌన్లోడ్లను సాధించింది. జియో మీట్ అపరిమిత వీడియో కాల్స్ సదుపాయాన్ని అందిస్తున్నట్లు ప్రకటించింది.
అయితే జూమ్ 40 నిమిషాలపాటు మాత్రమే ఉచితంగా వీడియో కాల్స్‌కు అవకాశమిస్తోంది.
ఇదీ చూడండి:ఆ పాలసీతో ఉద్యోగం పోయినా ఆర్థిక అండ!