టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి (సీఈఓ) సత్య నాదెళ్ల మరోసారి భారత పర్యటనకు రానున్నారు. ఈ నెలలోనే సత్య నాదెళ్ల భారత పర్యటన ఉంటుందని మైక్రోసాఫ్ట్ వర్గాలు స్పష్టం చేశాయి.
యువత, విద్యార్థులు, డెవలపర్లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో నాదెళ్ల సమావేశం అవుతారని వెల్లడించింది టెక్ దిగ్గజం. అయితే ఆయన పర్యటన తేదీలు, ఏఏ నగరాలను సందర్శించనున్నారనే విషయాలు మాత్రం స్పష్టం చేయలేదు.
విశ్వసనీయ వర్గాల ప్రకారం..
సత్యనాదెళ్ల భారత పర్యటన ఈనెల 24-26 మధ్య ఉండొచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. దిల్లీ, ముంబయి, బెంగళూరులో భారత పరిశ్రమల అధినేతలు, ప్రభుత్వ ప్రముఖులతో ఆయన ముచ్చటించే అవకాశముందని తెలుస్తోంది.
నాదెళ్ల పర్యటనకు ప్రాధాన్యం..
భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై సత్య నాదెళ్ల ఇటీవల స్పందిస్తూ.. "ప్రస్తుతం జరుగుతున్నది విచారకరం. మంచిది కాదు. భారత్‌కు వచ్చే బంగ్లాదేశ్ వలసదారుడు ఇన్ఫోసిస్ తదుపరి సీఈఓ అయితే చూడాలనుంది" అని పేర్కొన్నారు. ఈ ప్రకటన తర్వాత తొలిసారి భారత్‌కు రానున్న నేపథ్యంలో ఆయన పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.
స్థానికంగా డేటా స్టోరేజీ, ఈ-కామర్స్ కంపెనీలకు, సామాజిక మాధ్యమాలకు ప్రభుత్వ నిబంధనలు కఠినతరం.. వంటి అంశాలు నాదెళ్ల పర్యటనలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.
మరో వైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 24, 25 తేదీల్లో భారత్లో పర్యటించనున్న నేపథ్యంలో నాదెళ్ల రాకపై ఆసక్తి నెలకొంది.
ఇదీ చూడండి:ఫేస్బుక్లో జోరుగా 'నకిలీ' దందా- 27.5కోట్ల ఖాతాలు ఫేక్