దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ తన ఉత్పత్తిని భారీగా పెంచింది. కొవిడ్ లాక్‌డౌన్ తర్వాత ఈ స్థాయిలో ఉత్పత్తిని పెంచడం ఇదే తొలిసారి. ఇటీవల నాలుగు నెలల నుంచి విక్రయాల్లో వృద్ధి కనిపించిన నేపథ్యంలో తయారీ పుంజుకుంది. గత నెలలో ఈ సంస్థ 1,82,490 కార్లను తయారు చేయగా.. గతేడాది ఇదే సమయానికి 1,19,337 కార్లను ఉత్పత్తి చేసింది. అంటే సుమారు 52 శాతం వృద్ధి కనిపించింది.
మోడళ్ల వారీగా వృద్ధి ఇలా..
ఎంట్రీలెవల్ మినీ కార్ల తయారీ విభాగంలో ఈ వృద్ధిరేటు 51.43 శాతం పెరిగింది. దాదాపు 31,779 యూనిట్లను ఉత్పత్తి చేసింది. ఇక కాంపాక్ట్ సెగ్మెంట్ విభాగంలో వృద్ధిరేటు 60.21శాతంగా నమోదై 1,02,666 కార్లను తయారు చేసింది. గతేడాది ఇదే సీజన్‌లో 64,079 యూనిట్లనే ఉత్పత్తి చేసింది.
విటార బ్రెజా, ఎస్‌క్రాస్, ఎర్టిగా, ఎక్స్‌ఎల్6 విక్రయించే యుటిలిటీ వాహనాల్లో 21.67శాతం వృద్ధిరేటు నమోదైంది. సూపర్ క్యారలీ లైట్ వెహికల్స్ విభాగంలో 183.93శాతం ఉత్పత్తి పెరిగింది. సియాజ్ మోడల్ తయారీ మాత్రం 22.47శాతం తగ్గింది. అక్టోబర్ నెల అమ్మకాల్లో 19.8శాతం వృద్ధిరేటు నమోదైంది.
ఇదీ చూడండి:లిక్కర్ విక్రయాలు 29% డౌన్- కారణాలివే..