రుణ రహిత కంపెనీగా మారనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్), ఈ నెల 15న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించబోయే 43వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో మరిన్ని భారీ ప్రకటనలు చేస్తుందని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి. ఇప్పటికే భారీగా నిధులు సమీకరించిన డిజిటల్ విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌కు సంబంధించి, కొత్తగా ఆరంభించిన దృశ్యమాధ్యమ సమావేశ ఆన్‌లైన్ వేదిక జియోమీట్ గురించి 26 లక్షల మంది వాటాదార్లకు తీపికబుర్లు చెబుతారని అంచనా వేస్తున్నారు.
జియో ప్లాట్‌ఫామ్స్/మార్ట్
ఆర్‌ఐఎల్ అనుబంధ రిలయన్స్ రిటైల్‌కు చెందిన ఇ-కామర్స్ ప్లాట్‌పామ్ జియోమార్ట్ ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు నగరాలలో సేవలు ప్రారంభించింది. కొవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో నిత్యావసరాలు కూడా ఆన్‌లైన్‌లో తెప్పించుకోవడం పెరుగుతోంది. కోట్ల మంది చిరువ్యాపారులతో అనుసంధానమయ్యే జియోమార్ట్‌ను ఈ రంగంలో దిగ్గజ సంస్థగా నిలబెట్టాలన్నది ఆర్‌ఐఎల్ ప్రణాళిక. ఫేస్‌బుక్ నేరుగా జియో ప్లాట్‌ఫామ్స్‌లో దాదాపు 10 శాతం వాటా కొనుగోలు చేయగా, ఫేస్‌బుక్ ఆధీనంలోని మెసేజింగ్ యాప్ వాట్సాప్ సాయంతో జియోమార్ట్ కార్యకలాపాలు సాగుతున్నాయి. భారీగా నిధులు సమీకరించిన జియో ప్లాట్‌ఫామ్స్‌ను అంతర్జాతీయ స్టాక్‌ఎక్స్ఛేంజీల్లో నమోదు చేస్తారనే అంచనాలున్నాయి. ఈ ప్రకటన కోసం వాటాదార్లంతా ఎదురు చూస్తున్నారు.
అగ్రగామి జియో
దేశీయ మొబైల్ విపణిలో రిలయన్స్ జియో అగ్రగామిగా ఎదిగింది. 36 శాతం వాటా పొందింది. 2024కు చందాదార్ల పరంగా 41 శాతం వాటా, ఆదాయం పరంగా 44 శాతం వాటా సాధించాలనేది సంస్థ లక్ష్యం. వైరుతో అత్యధికవేగం బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించే జియో ఫైబర్‌పై సంస్థ మరింత దృష్టి సారించే అవకాశం ఉంది.
ఆరామ్‌తో ఒప్పందం ఎందాకా?
చమురు-రసాయనాల వ్యాపారంలో 20 శాతం వాటాను ప్రపంచంలోనే ముడిచమురు అధికంగా ఎగుమతి చేసే సౌదీ చమురు అగ్రగామి సంస్థ ఆరామ్‌కోకు 2,000 కోట్ల డాలర్ల (సుమారు రూ.1,12,500 కోట్లు)కు విక్రయించేందుకు సంప్రదింపులు జరుగుతున్నాయని గతేడాది ఆర్‌ఐఎల్ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించిన సంగతి విదితమే. ఆరామ్‌కో ఒప్పందంపై చేసే వ్యాఖ్యలు షేరు కదలికలనూ ప్రభావితం చేస్తాయి.
రిలయన్స్ టౌన్‌షిప్‌లో సుజుకీ ప్లాంట్
జపాన్ కంపెనీ సుజుకీ (టీసుజుకీ) హరియాణా (ఝజ్జర్)లోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ మోడల్ ఎకనామిక్ టౌన్‌షిప్ (ఎంఈటీఎల్)లో తయారీ ప్లాంటు ఏర్పాటు చేయనుంది. వాహన పరిశ్రమకు అవసరమైన స్టీరింగ్ నకుల్‌ను ఇక్కడ తయారు చేస్తారు.
గత ఏజీఎంలలో ప్రకటనలు
- 2019: రూ.3.5 లక్షల కోట్ల డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పన, జియో ఫైబర్ సేవలకు శ్రీకారం
- 2018: రూ.501 చెల్లించి సరికొత్త జియోఫోన్ పొందే వీలు
- 2017: రిఫండబుల్ డిపాజిట్ రూ.1500తో జియోఫోన్ ఆవిష్కరణ
ఇదీ చూడండి:జియో ప్లాట్‌ఫామ్స్‌లో క్వాల్‌కామ్ రూ.730 కోట్ల పెట్టుబడి