ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ఎల్జీ.. 5జీ మొబైల్ సెగ్మెంట్లో దేశంలోనే అగ్రగామిలో నిలిచేలా ప్రయత్నాలు చేస్తోంది. భారత్లో 5జీ అందుబాటులోకి వచ్చిన వెంటనే వీ5 అనే 5జీ ఫోన్ను విడుదల చేయనున్నట్లు తెలిపారు ఆ సంస్థ భారత మొబైల్స్ బిజినెస్ సారథి అద్విత్ వైద్యా.
2020 ద్వితీయార్థంలోగా దేశంలో 5జీ నెట్వర్క్ అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
డబ్ల్యూ సిరీస్ ఫోన్ల ఆవిష్కరణ...
ఎల్జీని వినియోగదారులకు మరింత చేరువగా తీసుకెళ్లేందుకు.. భారతీయ అవసరాలకు అనుగుణంగా ఉండే డబ్ల్యూ సిరీస్ ఫోన్ల శ్రేణిని హైదరాబాద్లో ఆవిష్కరించింది. డబ్ల్యూ 10, డబ్ల్యూ 30, డబ్ల్యూ 30 ప్రో పేర్లతో మూడు ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇవి ప్రస్తుతానికి అమెజాన్లో మాత్రమే లభించనున్నాయి.
మరో రెండు ఫోన్లను కూడా ఈ సంవత్సరమే తీసుకురానున్నట్లు వెల్లడించారు అద్విత్ వైద్యా. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రెండంకెల వాటాను ఆశిస్తున్నట్లు తెలిపారు.
తెలుగు రాష్ట్రాలు భళా....
దేశవ్యాప్త సరాసరి కంటే తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ల మార్కెట్ వృద్ధి ఎక్కువగా ఉందని ఆయన అన్నారు. దేశంలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వార్షికంగా 12 నుంచి 15 శాతం వృద్ధి రేటును సాధిస్తోందని పేర్కొన్నారు. అదే సమయంలో మధ్య శ్రేణి ధర ఫోన్ల మార్కెట్ మాత్రం దాదాపు 25 నుంచి 30 శాతం వేగంగా దూసుకెళ్తోందని తెలిపారు.