జెట్ ఎయిర్‌వేస్‌లోని సామర్థ్యమున్న ఉద్యోగులంతా ఇతర సంస్థల్లో చేరుతున్నారన్న కేంద్ర విమానయాన శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా వ్యాఖ్యలపై ఆ సంస్థ ఉద్యోగులు స్పందించారు.
జెట్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ మూతపడనివ్వబోమని ఉద్ఘాటించారు. ఆల్ ఇండియా జెట్ ఎయిర్వేస్ టెక్నిషియన్స్ అసోసియేషన్ (ఏఐజేఏటీఏ)లోని 800 మంది సభ్యులు రాసిన బహిరంగ లేఖలో ఈ విషయన్ని పేర్కొన్నారు.
ఇప్పటివరకూ జెట్‌ను ఉద్యోగులు వీడటానికి కారణం ఆర్థిక పరిస్థితి, ఇతర ఆసక్తులేనని సమాఖ్య పేర్కొంది. ఉద్యోగుల్లో చాలా మంది 15-25 ఏళ్ల నుంచి పని చేస్తున్నారని స్పష్టం చేసింది.
"సంస్థ కోసం మేము రక్తాన్ని, చెమటను, కన్నీళ్లను వెచ్చించాం. కంపెనీ వీడిన చాలా మంది తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అవసరమైన ప్రతీసారి వెనక్కి వస్తారు" అని సమాఖ్య ప్రకటించింది.
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ ఈ నెల 17 నుంచి తాత్కాలికంగా కార్యకలాపాలను నిలిపివేసింది. ఈ నేపథ్యంలో జెట్ భవితవ్యంపై చర్చించేందుకు జెట్ సీఈఓ వినయ్ దూబే సహా సంస్థ సీనియర్ అధికారులు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమయ్యారు.
జెట్‌కు సాయం అందించేందుకు జైట్లీ సానుకూలంగా స్పందించారని దూబే వెల్లడించారు.
ఇదీ చూడండి: రాష్ట్రపతి జోక్యం కోరిన జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులు