ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (ఆర్సెప్)లో భారత్ చేరదని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చేసిన ప్రకటనపై దేశవ్యాప్తంగా పరిశ్రమ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంపై గుజరాత్ సహకార పాల ఉత్పత్తి సమాఖ్య (అమూల్) మేనేజింగ్ డైరక్టర్ ఆర్.ఎస్. సోది తన ఆనందాన్ని 'ఈటీవీ భారత్'తో పంచుకున్నారు.
"భారత్‌లో పాల ఉత్పత్తి న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలోలా వ్యాపారం కాదు. దేశవ్యాప్తంగా దాదాపు 10 కోట్ల మంది రైతులకు జీవనాధారం. డైరీ ఉత్పత్తిని పెంచేందుకు మేము చేసిన సిఫార్సుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. రైతులకు ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించింది. ఇలా చేయడం సంతోషకరం."
- ఆర్.ఎస్. సోది, అమూల్ మేనేజింగ్ డైరెక్టర్
కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు ఈ ఏడాది జులైలో ఆర్.ఎస్.సోది ఒక లేఖ రాశారు. ఆర్సెప్ ఒప్పందానికి భారత్ అంగీకరిస్తే.. ఎదురయ్యే సమస్యలను అందులో వివరించారు.
డైరీ పరిశ్రమపై మాంద్యం ప్రభావం?
ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక వృద్ధి మందగమన ప్రభావం డైరీ పరిశ్రమపై అంతగా ఉండదని ఆర్.ఎస్.సోది అన్నారు. డైరీ ఉత్పత్తుల వినియోగంలోనూ ఎలాంటి మార్పు ఉండదని విశ్లేషించారు.
ఇందుకు ఉదాహరణగా.. గత ఏడు నెలల్లో అన్ని డైరీ ఉత్పత్తుల విభాగాల్లో రెండింతల వృద్ధి సాధించినట్లు తెలిపారు. భవిష్యత్‌లోనూ డైరీ ఉత్పత్తుల డిమాండ్ వృద్ధి కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కారణంగానే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు భారత డైరీ పరిశ్రమలోకి ప్రవేశించేందుకు ఆసక్తి చూపుతున్నాయని వివరించారు.
డైరీ పరిశ్రమలో విదేశీ పెట్టుబడులు?
భారత డైరీ పరిశ్రమలో విదేశీ పెట్టుబడులు, సాంకేతికతకు తాము వ్యతిరేకం కాదని ఆర్.ఎస్ సోది స్పష్టం చేశారు. అయితే భారత రైతుల నుంచి మాత్రమే వాళ్లు పాలు కొనుగోలు చేయాలనే నిబంధన ఉండాలని ఆయన విన్నవించారు.
ఇదీ చూడండి: 'కుటుంబ వ్యాపారాలకు వారసత్వ సమస్యలు'